ఎట్టకేలకు కుదిరిన మహూర్తం-ఈనెల 30న నెల్లూరుకు జగన్
నెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్ట్ లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈనెల 30న సీఎం జగన్ ని నెల్లూరులోని ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
నెల్లూరు జిల్లాలో రెండు ప్రాజెక్ట్ లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీడీపీ హయాంనుంచి కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ లను ఈ నెలలోనే సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఈనేరకు మహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 30న సీఎం జగన్ ని నెల్లూరులోని ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి ఆహ్వానించేందుకు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్ ను ఆయన ఆహ్వానించారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ని కలసిన విక్రమ్ రెడ్డి, ఇప్పుడు రెండోసారి నియోజకవర్గ అభివృద్ధి పనులకోసం జగన్ ని కలిశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది, సంక్షేమంపై ఆయన జగన్ కు వినతిపత్రం అందించారు. సంగం బ్యారేజ్ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో బ్యారేజ్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా జగన్ ను ఆహ్వానించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి సీఎం జగన్ కు వివరించారు. సంక్షేమ, అభివృద్ది పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ది ప్రణాళికలకు సంబంధించి పనులు, నిధులు మంజూరుకోసం వినతిపత్రాలు అందించారు. వాటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం.
సంగం బ్యారేజ్ ప్రతిపాదన 14ఏళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సంగం వద్ద పెన్నా నదిపై లో లెవల్ వంతెన ఉంది. బ్రిటిష్ కాలం నాటి ఆ వంతెన వరదనీటికి పూర్తిగా మునిగిపోతుంది. కేవలం కెనాల్స్ కి నీటిని వదిలిపెట్టి, నదికి అడ్డుగా ఇసుక బస్తాలు వేసి ఉంటేనే.. ఆ వంతెనపైనుంచి రాకపోకలు సాగించగలరు. అలాంటి ఏర్పాటుకి ప్రత్యామ్నాయంగా సంగం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం 14 ఏళ్ల క్రితమే ప్రణాళిక రూపొందించింది.
సంగం బ్యారేజీ స్పిల్ వే 1,195 మీటర్ల పొడవున ఉంటుంది. స్పిల్ వేకు 85 గేట్లు అమర్చారు. బ్యారేజీకి కుడి, ఎడమ వైపు మట్టికట్టల పనులు పూర్తయ్యాయి. ఈ బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ గా పేరు పెట్టి ఇటీవలే గెజిట్ విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
వాస్తవానికి 2019 మే 30న సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసేనాటికే ఈ బ్యారేజీ పనులు 82.86 శాతం పూర్తయ్యాయి. ఆ తర్వాత పనులు దాదాపుగా నత్తనడకన సాగాయి అని చెప్పుకోవాలి. కరోనా వల్ల పరిస్థితులు సహకరించలేదు. స్థానిక శాసన సభ్యుడు, మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో మరికొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఇప్పుడు సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. ఈనెల 30నాటికి సర్వాంగ సుందరంగా బ్యారేజ్ ని రూపొందించి సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఇటీవలే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బ్యారేజ్ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించి వెళ్లారు. తాజాగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, సీఎం జగన్ ని కలసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంతో ఇక అధికారికంగా బ్యారేజ్ ప్రారంభోత్సవానికి మహూర్తం కుదిరినట్టే తెలుస్తోంది. అదే రోజు నెల్లూరు బ్యారేజ్ ని కూడా సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది.