Chaina New Border Law: అమల్లోకి చైనా కొత్త సరిహద్దు చట్టం ! భారత్‌ను టార్గెట్ చేసిందా ?
చైనా కొత్త సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. సరిహద్దుల విషయంలో భారత్‌తోనే తరచూ చైనా గొడవలకు వస్తోంది. దీంతో ఈ చట్టం భారత్‌ను టార్గెట్ చేసి తీసుకొచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చైనా ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సరిహద్దు భద్రతా చట్టాన్ని అమల్లోకి తెచ్చుకుంది. వియత్నాం, మియన్మార్ నుండి అక్రమంగా సరిహద్దును దాటుతున్న వారి కారణంగా చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అలాగే తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు.. వీగర్ ముస్లింవర్గానికి చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు సరిహద్దు దాటి తన వైపుకు రావచ్చన్న కారణాలను చూపి చైనా సరిహద్దు భద్రతా చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
Also Read: అమెరికాలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల సునామీ... హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ !
సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించి చైనా ఒక చట్టాన్ని తేవడం ఇదే తొలి సారి.చైనా 14 దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 12 దేశాలతో చైనాకు ఎలాంటి సమస్యలు లేవు. భూటాన్, ఇండియాతోనే సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భూటాన్‌తో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు.కానీ ఇండియాతో మాత్రం చర్చలతో కూడా పరిష్కారం కానన్ని వివాదాలను చైనా పెట్టుకుంది. తూర్పు లద్ధాఖ్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్, చైనాల మధ్య దీర్ఘకాలంగా వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా ఇప్పటికీ వాదిస్తూ ఉంటుంది.
చైనా తెచ్చిన ఈ చట్టం ఇండియాను టార్గెట్ చేసుకునే తెచ్చారన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సరిహద్దులు మూసివేయడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో నిర్మాణ పనులను మెరుగుపరచడం, ఆ నిర్మాణాలకు మద్దతు సరిహద్దు ప్రాంతాలలో ప్రజా సేవలను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని చైనా చెబుతోంది. కొత్త చట్టం ప్రకారం చూస్తే చైనా వ్యూహాత్మకంగా భారత్ సరిహద్దుల్లో పట్టణాలు నిర్మించే ఆలోచన చేస్తోందని భావిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దులో చైనా 600 గ్రామాలను నిర్మించింది. ఆ గ్రామాలను కలిపే రోడ్లు కూడా కట్టింది.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
భారతదేశం-చైనాల మధ్య 3,488 కి.మీ. భూ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో ఉన్నాయి. వీటిపై చైనా కన్ను ఉంది. అందుకే చైనా తెచ్చిన కొత్త చట్టంపై భారత్ ప్రత్యేకంగా పరిశీలన జరుపుతోంది. భారత్ కూడా చైనాకు కౌంటర్‌గా ఓ భద్రతా చట్టాన్ని తెచ్చే ఆలోచన చేస్తోంది. భారత్ - చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ను రెండు దేశాలు గౌరవిస్తున్నాయి. ఇప్పుడు చైనా దానికి తిలోదకాలు ఇస్తూండటంతో భారత్ కూడా కౌంటర్‌గా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో భారత్ - చైనామధ్య ఈ కొత్త భద్రతా చట్టమే కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం