China Covid: ఆరు నెలల తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణం
China Covid: చైనాలో 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది.
China Covid: కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కొవిడ్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ చైనా మత్రం కఠిన లాక్‌డౌన్‌లు పాఠిస్తోంది. అయినప్పటికీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ కొవిడ్ మరణం నమోదైంది.
మరణాలు లేవు
చైనాలో చాలా నగరాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ మరణాలు మాత్రం నమోదు కావడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 26న షాంఘైకు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ తాజాగా బీజింగ్‌కు చెందిన ఓ 87 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కొవిడ్‌తో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దీంతో చైనాలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా 5,227 మంది మృతి చెందినట్లయింది.
ఆగ్రహం
కరోనా వైరస్ కట్టడికి చైనా అవలంబిస్తోన్న జీరో కొవిడ్ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇటీవలే ఓ మూడేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది.
చైనాలోని ఝేంగ్‌జువా నగరంలోని లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. లక్షల మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. లక్షణాలున్నవారిని నగరానికి దూరంగా ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఇలాగే ఓ కుటుంబం నగరానికి దూరంగా ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలోనే వారి నాలుగు నెలల పాపకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించారు. కానీ, కొవిడ్ ఆంక్షల కారణంగా అధికారులు బయటకు వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో చిన్నారి మృతి చెందింది.
Also Read: Akhilesh Yadav: 'నన్ను ఆశీర్వదించండి మావయ్య'- శివపాల్ యాదవ్ కాళ్లు మొక్కిన అఖిలేశ్!