Chandrayaan 3: పిట్టల్ని తోలే టెక్నిక్‌తో చంద్రయాన్ 3 ప్రయోగం
Chandrayaan 3: చంద్రయాన్ 3 కోసం ఇస్రో చవకైన ప్రయోగం చేసింది. స్లింగ్ షాట్ టెక్నాలజీని వాడుతోంది.
Chandrayaan 3: మీకు వడిసెల తెలుసు కదా. పొలాల్లో ప్రత్యేకించి కంకులు ఉండే మొక్కజొన్న లాంటి పొలాల్లో పిట్టలు వాలితే రైతులు వడిశెల చిన్న రాయిపెట్టి చేత్తో గిరగిరా తిప్పి విసురుతూ ఉంటారు. పిట్టలు రాయి శబ్దానికి ఎగిరి పారిపోతుంటాయి. జస్ట్ వాటిని తరిమేసేందుకు రైతులు ఈ టెక్నిక్ వాడుతూ ఉంటారు. దీన్ని ఇంగ్లీషులో స్లింగ్ షాట్ అంటారు.
ఇప్పుడు ఇస్రో చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్ మిషన్ కోసం ఈ స్లింగ్ షాట్ టెక్నాలజీనే వాడుతోంది. అంటే రాకెట్ ప్రయోగం జరిగిన వెంటనే చంద్రుడే లక్ష్యంగా దూసుకెళ్లటం కాకుండా ఇదిగో ఇలా భూమి చుట్టూ తిప్పి తిప్పి తిప్పి భూమి కక్ష్య దాని గురుత్వాకర్షణ శక్తి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేసి చంద్రుడి కక్ష్యలోకి అమాంతం వెళ్లటం అన్నమాట.
మళ్లీ చంద్రుడు కక్ష్య చుట్టూ ఇలానే తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లటం. ఇలా చేయటం ద్వారా చాలా ఇంధనం ఆదా అవుతుంది. మాములుగా వడిశెల లో రాయి పెట్టి కొట్టిన దానికంటే గిరగిరా తిప్పి విసిరితేనే రాయి ఎక్కువ దూరం వెళ్తుంది. ఇదే సిద్ధాంతాన్ని అచ్చంగా అమలు చేస్తున్న ఇస్రో చంద్రుడిపై ప్రయోగాలకు పెద్దగా ఖర్చు పెట్టడం లేదు. ప్రయోగం కొంచెం లేట్ అవుతుంది. బట్ పర్లేదు. ఇదే మెరుగైన పద్ధతని ఇస్రో భావిస్తోంది. అందుకే చంద్రయాన్ 3 ప్రయోగం ఈరోజు జరిగితే చంద్రుడి మీద ల్యాండర్ దిగటానికి వచ్చే నెల 24, 25 వరకూ వేచి చూడాలి. ఇలా చేయటం ద్వారా ఖర్చు బాగా తగ్గించుకుంటున్న ఇస్రో చంద్రయాన్ 3 కోసం 615 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తూ నాసా కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది.