Water On Moon: చందమామపై ఉన్న నీరంతా భూమి నుంచి వెళ్లిందే- చంద్రయాన్-1తో తెలిసిన నిజాలివే
చందమామ ఉన్న నీటిజాడల గుట్టు వీడింది. జాబిల్లి ఉన్న నీరంతా భూమి వల్ల ఏర్పడిందే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రయాన్-1 తెచ్చిన డేటా ఆధారంగా చంద్రుడిపై నీటి గుట్టును బయటపెట్టారు.
చంద్రుడిపై ఉన్న నీటిజాడల మిస్టరీ వీడింది. జాబిల్లిపై నీటిజాడలు ఉన్నాయని... ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలినా..? ఆ నీరంతా ఎక్కడిది..? నీటిజాడలు ఎలా ఏర్పడ్డాయి..? అనేవి ప్రశ్నిలుగా మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. చంద్రుడిపైకి నీరు ఎలా ఏర్పండి..? ఎలా ఏర్పడుతోంది..? అన్నది తెలిసిపోయింది. అండపిండ బ్రహ్మాండంలో... గ్రహాల మధ్య జరుగుతున్న రహస్య ప్రక్రియ బయటపడింది. చందమామపై ఉన్న నీటి ఆనవాళ్లకు భూగ్రహమే కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూగ్రహం నుండి అధిక శక్తి గల ఎలక్ట్రాన్లు దాని ఉపగ్రహమైన చంద్రునిపై నీటిని ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు. చంద్రయాన్-1 ద్వారా సేకరించిన డేటా ఆధారంగా... జాబిల్లిపై నీటిజాడలు ఏర్పడటానికి గల కారణాలను విశ్లేషించారు.
చందమామపై నీటి జాడలు ఉన్నట్టు భారత్ సహా పలు దేశాలు జరిపిన ప్రయోగాల్లో నిర్ధారణ అయినా.. అవి ఎలా ఏర్పడ్డాయన్న అన్న ఉత్కంఠకు.. ఇప్పుడు తెరపడింది. వాతావరణమేలేని జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్ల రహస్యాల గుట్టును చంద్రయాన్-1 ఛేదించింది. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ కారణంగానే చంద్రుడిపై నీరు ఏర్పడిందని తేల్చారు. చంద్రయాన్-1 మిషన్‌లోని ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అయిన మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను అమెరికాలోని మనోవాలో గల యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఆ వివరాలను జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించింది. భూ వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్స్.. చంద్రుడిపై నీరు ఏర్పడటానికి దోహదపడి ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది.
భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్లు చంద్రుని ఉపరితలంపై ఉన్న రాళ్లు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ ప్రక్రియలకు దోహదం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడిపై నీటి సాంద్రత, నీటి పంపిణీ దాని నిర్మాణం, పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ అణ్వేషణకు నీటి వనరులను అందించడానికి ఈ పరిశోధనలు కీలకమని పరిశోధకులు చెప్పారు. ఈ కొత్త అన్వేషణ చంద్రునిపై శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో... గతంలో కనుగొనబడిన నీటి మంచుకు సంబంధించి మూలాలను వివరించడానికి కూడా సహాయపడుతుందని చెప్పారు.
సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్‌లో ఉండే ప్రోటాన్ల వంటి అధిక శక్తి అణువుల చందమామ ఉపరితలాన్ని తాకినప్పుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గతంలో జరిగిన చాలా అధ్యయానాలు వెల్లడించాయి. అయితే చంద్రుడు భూ అయస్కాంత వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు సోలార్ విండ్ తాకదు. అలాంటి సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. చంద్రయాన్-1 సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం.. భూఅయస్కాంతావరణంలో చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు కూడా జాబిల్లిపై నీరు ఏర్పడినట్లు తేలింది. అంటే.. సౌరగాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే జాబిల్లిపై నీరు ఏర్పడే అదనపు మార్గాలు ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా, భూ వాతావరణంలోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ కూడా.. సౌరగాలిలోని ప్రోటాన్ల మాదిరిగా పనిచేస్తుందని హవాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చంద్రుడి మీద నీటిజాడలకు... ఇదొక్కటే కారణం కాదు. సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. భూమిపై వాతావరణం నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంటాయి. ఇవి చంద్రుడి మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చని గతంలో కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తానికి చంద్రునిపై నీటి అణువుల ఆవిష్కరణలో చంద్రయాన్-1 కీలక పాత్ర పోషించింది. చంద్రయాన్-1ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2008 అక్టోబర్‌లో ప్రయోగించింది. ఆర్బిటర్, ఇంపాక్టర్‌తో కూడిన ఈ మిషన్ 2009 వరకు పనిచేసింది. చంద్రుడిపై నీటి జాడలను గుర్తించింది.