Manipur Women Naked Parade: మణిపూర్ ఘటనపై కేంద్రం సీరియస్- నిందితుడు అరెస్ట్
మణిపూర్‌లో చెలరేగుతున్న ఘర్షణ, అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్‌లో చెలరేగుతున్న ఘర్షణ, అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ అవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విటర్, ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, సామాజిక మాధ్యమాలు భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికార వర్గాలు సూచించాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మే 4న ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు పురుషులున్నారు. వారంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. ఈ ఘటనతో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం స్పందిస్తూ ఘటనను సుమోటోగా పరిగణించి కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.
అసలేం జరిగింది?
రెండు నెలల క్రితం మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై ఓ గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దారుణం మే 4 నాటిదని పోలీసులు చెబుతున్నారు. కాంగ్‌పోక్‌పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్‌లో ఆ గ్రామ పెద్ద ఈ దుర్ఘటనపై ఫిర్యాదు చేశారని... జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది తౌబాల్‌లోని నాంగ్‌పోక్ సెక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అంటున్నారు.
ఈ భయంకరమైన దాడి వీడియో వైరల్ కావడంతో స్థానిక గిరిజన నాయకుల ఫోరం (ITLF) ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను స్పందించాలని అభ్యర్థించింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మొదట్లో ఇలాంటివి చాలా జరిగాయని ఐటీఎల్‌ఎఫ్ సభ్యులు తెలిపారు. మే 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు 800-1,000 మంది దుండగులు ఆయుధాలతో కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలోకి ప్రవేశించారు. వారు గ్రామంపై విరుచుకుపడ్డారు. ఇళ్లను ధ్వంసం చేసి, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంటసామాగ్రి, బట్టలు, రేషన్, పశువులు, పెంపుడు జంతువులను దోచుకున్నారు. మహిళలను వివస్త్రను చేసి ఊరేగించారు. వీళ్ల దాడులకు తాళలేక 56 ఏళ్ల వ్యక్తి అక్కడే మృతి చెందాడు.
సీఎంకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫోన్
ఈ అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్రం కూడా సిద్ధమైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ ఘటనను పూర్తిగా అమానుషమని, దీనిపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులను శిక్షిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మణిపూర్‌లో మహిళలను బట్టలు లేకుండా ఊరేగించిన ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ దారుణాన్ని పార్లమెంటులో గట్టిగా లేవనెత్తనున్నాయి. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రతిపక్షాలు గతంలో పలుమార్లు ప్రశ్నించాయి. ఇప్పుడు తాజా వీడియో బయటకు రావడంతో ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించాయి.
ఖండించిన రాహుల్, ప్రియాంక, అక్షయ్ కుమార్
ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయని, కానీ ‘ఇండియా’ (ప్రతిపక్షాల కూటమి) మౌనంగా ఉండదన్నారు. మణిపుర్ ప్రజలకు అండగా ఉంటాం. శాంతి అందరి ముందున్న ఏకైక మార్గమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఘటన సిగ్గుచేటని డిల్లీ సీఎం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సహించకూడదని అన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణిపుర్ ఘటనకు సంబంధించిన వీడియో చూసి ఆవేదన చెందానని. నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.