BBC IT Raid: ఉద్యోగుల ఫోన్‌లు లాక్కున్నారు, కొందరిని ఇబ్బంది పెట్టారు - ఐటీ అధికారులపై బీబీసీ ఆరోపణలు
BBC IT Raid: ఐటీ అధికారులపై బీబీసీ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది.
BBC IT Raids:
మూడు రోజుల పాటు సర్వే..
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న అంశం..బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ సర్వేలో కొన్ని అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు అధికారులు. అయితే...దీనిపై BBC యాజమాన్యం అసహనం వ్యక్తం చేస్తోంది.
ఢిల్లీ, ముంబయిల్లోని కార్యాలయాల్లో సర్వే చేసిన సమయంలో తమ జర్నలిస్ట్‌లను పని చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. సర్వే పూర్తైందని...ఇక రోజువారీ కార్యకలాపాలు కొనసాగించవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) వెల్లడించింది. కానీ...BBC మాత్రం ఆ అధికారులపై తీవ్రంగా మండి పడుతోంది. తమ ఉద్యోగులను గంటల కొద్ది పని చేయకుండా నిలువరించారని చెబుతోంది. అంతే కాదు. కొందరు అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించింది. పోలీసులూ ఇదే విధంగా ప్రవర్తించారని స్పష్టం చేసింది. జర్నిలిస్ట్‌ల ఫోన్లు లాక్కున్నారని, విచారణ పేరుతో రకరకాల ప్రశ్నలు వేసి వేధించారని మండి పడింది. అంతే కాదు. ఈ సర్వేకు సంబంధించిన వార్తలనూ రాయకుండా అడ్డుకున్నారని చెప్పింది BBC యాజమాన్యం. ఈ తీరుపై సీనియర్ ఎడిటర్లు ప్రశ్నించాక కానీ...పనులకు అనుమతించలేదని తెలిపింది. హిందీ, ఇంగ్లీష్ జర్నలిస్ట్‌లనూ ఇబ్బంది పెట్టారని ఆగ్రహంవ్యక్తం చేసింది. బీబీసీ ఆఫీస్‌లలో దాదాపు మూడు రోజుల పాటు దాడులు కొనసాగాయి. అయితే...ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ చేసిన కారణంగానే BBCపై ఇలా దాడులు చేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చివరకు ఏం తేల్చిందంటే..?
బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజులపాటు నిర్వహించిన ఐటీ 'సర్వే'కి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని పన్ను చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు తమ సర్వేలో తేలినట్లు ప్రాథమికంగా తెలిపింది. పలు గ్రూప్ సంస్థల ద్వారా ఆర్జించిన ఆదాయం, లాభాలు భారతదేశంలోని కార్యకలాపాల అనుగుణంగా లేవని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఆఫీసులపై ఐటీ సర్వే మంగళవారం ఉదయం ప్రారంభమై గురువారం రాత్రి దాదాపు 59 గంటల తర్వాత ముగిసింది. బీబీసీ సంస్థకు ఆదాయం, గ్రూప్ లోని పలు సంస్థల ద్వారా ఆర్జించిన లాభాలు భారతదేశంలో కార్యకలాపాల తీరుకు అనుగుణంగా లేవు అని.. బదిలీ ధర డాక్యుమెంటేషన్‌కు సంబంధించి అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తిచినట్లు సీబీడీటీ ఓ ప్రకటన లో తెలిపింది. "బదిలీ అయిన నగదు, డాక్యుమెంటేషన్ పరిశీలించగా.. ఐటీ సర్వేలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఉద్యోగుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలు, డిజిటల్ సాక్ష్యాలు, పత్రాలు లాంటి ముఖ్యమైన సాక్ష్యాలను ఐటీ బృందాలు సేకరించినట్లు CBDT తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 (చట్టం)లోని సెక్షన్ 133A కింద సర్వే కింద బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో ఐటీ సర్వే నిర్వహించినట్లు ప్రకటనలో ప్రకటన పేర్కొంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
Also Read: BJP South Tension : దక్షిణాదిలో బీజేపీ ఆశలు ఎంత వరకూ ఫలిస్తాయి ? తెలంగాణలో లక్ష్యం చేరుకుంటుందా ?