రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Hyderabad Balapur Ganesh Laddu Auction 2023: హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమస్సో... బాలాపూర్ లడ్డూ వేలం కూడా అంతే ఫేమస్. అందుకే గణేష్ నిమజ్జనం టైంలో బాలాపూర్ లడ్డూ ఎవరు పాడారు. ఎంతకు పాడారు అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూ ఉంటుంది.
ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో 36 మంది భక్తులు పాల్గొన్నారు.
గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికితే ఈసారి అంతకు మించిపోయింది. 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దాయనంద్ రెడ్డి దక్కించుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వేలాంపాటలో పాల్గొనాలనే వాళ్లంతా ఉత్సవ కమిటీకి ముందుగానే ఇవ్వాలని తీర్మానించారు.
గతేడాది లడ్డూ దక్కించుకున్న లక్ష్మారెడ్డి
గతేడాది ఈ లడ్డూ 24 లక్షల 60 వేలు చెల్లించి వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. ఈయన ఈసారి కూడా వేలంలో పాల్గొన్నారు. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు.
తొలుత నిర్వహకులు లడ్డూ ధరను 5 లక్షల నుంచి ప్రారంభించారు. బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోయారు. చివరకు 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.
గణేష్ లడ్డూ వేలం అనగానే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు బాలాపూర్ గ్రామంలో నగరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూను వేలం వేయడాన్ని మొదట ప్రారంభించింది అక్కడే. మొదట కొంత మొత్తం ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ.. బాలాపూర్ లడ్డూ వేలం ధర వేలు, 10 వేలు, లక్షలు దాటి పదుల లక్షల్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం దాని రికార్డును అదే బద్దలు కొట్టుకుంటోంది. బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు తమకు చాలా మంచి జరుగుతోందని బలంగా నమ్ముతున్నారు. అది వారికి, వారి కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు మేలు జరుగుతోందని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా పాకింది. బాలాపూర్ లడ్డూను ఎలాగైన సొంతం చేసుకోవాలన్న కాంక్ష పెరిగి పోయింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు సైతం వెచ్చించడానికి వెనకాడటం లేదు.
ఇప్పటి వరకు లడ్డూ దక్కించుకున్న వ్యక్తులు
సంవత్సరం | దక్కించుకున్న వ్యక్తులు | పాడుకున్న ధర |
1994 | కొలను మోహన్ రెడ్డి | రూ. 450 |
1995 | కొలనుమోహాన్ రెడ్డి | రూ.4500 |
1996 | కొలను కృష్ణారెడ్డి | రూ.18 వేలు |
1997 | కొలను కృష్ణారెడ్డి | రూ.28వేలు |
1998 | కొలను మోహన్ రెడ్డి | రూ. 51వేలు |
1998 | కళ్లెం ప్రతాప్ రెడ్డి | రూ.65వేలు |
1999 | కళ్లెం అంజిరెడ్డి | రూ.66వేలు |
2000 | జి. రఘునందన్ చారి | రూ.85వేలు |
2001 | కందాడ మాధవరెడ్డి | రూ.1.05లక్షలు |
2002 | చిగురంత తిరుపతిరెడ్డి | రూ.1.55లక్షలు |
2003 | కొలను మోహన్ రెడ్డి | రూ.2.01లక్షలు |
2004 | ఇబ్రహీం శేఖర్ | రూ.2.08లక్షలు |
2005 | చిగురంత తిరుపతి రెడ్డి | రూ.3 లక్షలు |
2006 | జి.రఘునందన్ చారి | రూ.4.15లక్షలు |
2007 | కొలను మోహన్ రెడ్డి | రూ. 5.07 లక్షలు |
2008 | సరిత | రూ.5.10లక్షలు |
2009 | కొడలి శ్రీధర్ బాబు | రూ. 5.35లక్షలు |
2010 | కొలను బ్రదర్స్ | రూ. 5.45లక్షలు |
2011 | పన్నాల గోవర్థన్ | రూ. 7.50లక్షలు |
2012 | తీగల కృష్ణారెడ్డి | రూ.9.26లక్షలు |
2013 | సింగిరెడ్డి జైహింద్ రెడ్డి | రూ. 9.50లక్షలు |
2014 | కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి | రూ. 10.32 లక్షలు |
2015 | స్కైలాబ్ రెడ్డి | రూ. 14.65లక్షలు |
2016 | నాగం తిరుపతి రెడ్డి | రూ.15.60 లక్షలు |
2017 | తిరుపతిరెడ్డి | రూ. 15 లక్షల 60 వేలు |
2018 | శ్రీనివాస్ గుప్తా | రూ. 16 లక్షల 60 వేలు |
2019 | కొలను రాంరెడ్డి | రూ.17.60 లక్షలు |
2021 | మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ | రూ. 18.90 లక్షలు |
2022 |
వంగేటి లక్ష్మారెడ్డి | రూ. 24 లక్షల 60 వేలు |
2023 | దాసరి దయానంద్ రెడ్డి | రూ. 27 లక్షలు |
కరోనా కారణంగా 2020లో వేలాం పాట నిర్వహించలేదు.