(Source: ECI/ABP News/ABP Majha)
Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై ప్రజల్లో క్రమంగా మార్పు - విచారణలో సీజేఐ కీలక వ్యాఖ్యలు !
స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని సీజేఐ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Same-Sex Marriage: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించే అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18వ తేదీ నుంచి వాదనలు విననుంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది . ఈ కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయని, స్వలింగ సంపర్కానికి ప్రజల్లో అంగీకారం పెరిగిందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌కు వదిలేయాలన్న కేంద్రం
విచారణ ప్రారంభానికి ముందు, జమియత్ ఉలేమా-ఇ-హింద్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయంపై రాష్ట్రాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాలని విజ్ఞప్తిచేశారు.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. తాము విచారణను వ్యతిరేకిస్తున్నామని, ముందుగా తమ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుందనన్నారు. ముందుగా పిటిషనర్ల వాదనలు వింటామని.. తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పాలని సీజేఐ సూచించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున విచారణకు హాజరైన కపిల్ సిబల్ కూడా మెహతా వాదనను సమర్థిస్తూ'ఈ విషయం కూడా వ్యక్తిగత చట్టానికి సంబంధించినది. దీని వల్ల పర్సనల్ లాకు సంబంధించిన వ్యవస్థలు దెబ్బతింటాయన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.
పిటిషన్లపై విచారణను వ్యతిరేకించిన కేంద్రం
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు.. వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని కేంద్రం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను.. ప్రస్తుతమున్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం పేర్కొంది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది.
స్వలింగ వివాహాలు ప్రమాదకరమని వాదన
ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. స్వలింగ వివాహం లాంటి కొత్త సామాజిక సంస్థను సృష్టించే ప్రశ్నకు.. కోర్టు తీర్పు సమాధానం ఇవ్వబోదని కేంద్రం వాదించింది. ఇది పూర్తిగా చట్ట పరిధిలో కొనసాగాల్సిన అంశమని, ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీం కోర్టుకు గుర్తు చేసింది. స్వలింగ వివాహాన్ని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది.