(Source: ECI/ABP News/ABP Majha)
YS Jagan: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
ఏపీ రైతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద నేరుగా నగదును రైతుల ఖాతాల్లో జమచేశారు.
గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఈ సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్ సైక్లోన్ వల్ల రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతులకు పెట్టుబడి రాయితీ అందించారు. ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ సాయం కింద రూ. 1,071 కోట్లు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు , రబీలో పంట నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద నేడు రూ.22 కోట్లను సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలని, అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని సీఎం పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని.. అందులో భాగంగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు అదే సీజన్ ముగిసేలోగా పంట నష్టపరిహారం చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయించారు. సెప్టెంబర్ 2021లో సంభవించిన గులాబ్ సైక్లోన్ వల్ల నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం నేరుగా నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఇందుకు సంబంధించి వివరాలను ఇటీవల వెల్లడించారు. నేడు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు పరిహారాన్ని అందజేశారు. అనంతపురం, కడప జిల్లాల్లో వేరుశెనగ పంట దెబ్బతిన్న రైతులకుసైతం 80% రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. రబీ సీజన్ ముగిసేలోగా ప్రభుత్వ సహకారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !