విదేశాల్లో మండిపోతున్న బొగ్గు ధరలు- జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచన
బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు.
మళ్లీ బొగ్గు కొరత రావచ్చని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సీఎం జగన్ సూచించారు. విదేశాల్లో బొగ్గు ధరలు మండిపోతున్నాయని హితవు పలికారు. రాష్ట్రంలో అవసరమైన నిల్వలను సమర్దవంతంగా సేకరించి పెట్టుకోవాలన్నారు. దీనికి అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... బొగ్గు నిల్వలపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు, ప్రగతిని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కచ్చితమైన డిమాండ్ తెలిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్ పాడైన 24 గంటల్లోపే కొత్తది పెట్టి రైతులకు అవాంతరాల్లేని విద్యుత్ అందిస్తున్నామన్న అధికారులు నివేదిక అందించారు. గడచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో పే రీప్లేస్ చేశామని అన్నారు.
జగన్ మాట్లాడుతూ... బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో చర్యలు తీసుకోవాలన్నారు. సులియారీ, మహానది కోల్‌బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని సూచించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారన్న అధికారులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా రైతులకు మేలు చేసేదిగా ఉండాలన్నారు సీఎం జగన్. అత్యంత మెరుగైన వ్యవస్థ తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. మీటర్ల వలన కలిగే ఉపయోగాలను గురించి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. దీని వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలన్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామని వివరించారు అధికారులు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని అన్నారు. దీని వల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని వివరించారు.
కృష్ణపట్నంలో విద్యుత్....
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్బంగా అధికారులు సీఎంకు నివేదిక అందించారు. ఈ ప్రాజెక్టును సీఎం జగన్ చేతులు మీదగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ థర్మల్ పవర్ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయాల కల్పనపై వివరాలు కూడా సీఎం జగన్ ఆరా తీశారు. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని, క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళండని జగన్ అధికారులకు సూచించారు.