Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Chandrababu: ఏపీలో మిగ్ జాం తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Chandrababu Letter to PM Modi on Michaung Cyclone: ఏపీలో 'మిగ్ జాం' తుపాను (Michaung Cyclone) వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను ఆదుకోవాలని ప్రధాని మోదీకి (PM Modi) మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపించిందని, 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 'తుపాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రూ.10 వేల కోట్ల నష్టం జరిగింది. దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాగు నీరు, నీటి పారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసాయంతో పాటు ఆక్వారంగానికి కూడా మిగ్ జాం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలి.' అని చంద్రబాబు లేఖలో కోరారు. తుపాను ఒక్క ఏపీకే పరిమితం కాలేదని, తమిళనాడుపై కూడా ప్రభావం చూపించిందని అన్నారు. 'మిగ్ జాం' తీవ్రత, నష్టం దృష్ట్యా ఈ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని లేఖలో కోరారు. అలా చేస్తే, బాధితులకు మెరుగైన సాయం అందుతుందని లేఖలో విజ్ఞప్తి చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో చంద్రబాబు పర్యటించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేల సాయం అందిస్తున్నామని వెల్లడించారు. .ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. విపత్తు సమయంలో రైతులను, సకాలంలో బాధితులను ఆదుకోలేని ఈ ప్రభుత్వం అవసరమా అని చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తర్వాత మొండిచేయి చూపించడం సీఎం జగన్ కు అలవాటేనని అన్నారు. రైతులను మోసం చేయడం చాలా సులువని సీఎం అనుకుంటున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విరివిగా సాయం అందించాలని, ప్రత్యేక జీవోల ద్వారా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన ఘటనపై స్పందించిన చంద్రబాబు, 'ప్రాజెక్ట్ గేట్లే మరమ్మతులు చేయలేని వ్యక్తి 3 రాజధానులు కడతారట' అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వైసీపీ నేతలకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఏపీలోనే ఉన్నారని, రైతు బాధలు పట్టని సీఎం జగన్ ను దేవుడు కూడా క్షమించడని మండిపడ్డారు.
Also Read: Andhra News: ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు - సీఎం జగన్ కీలక నిర్ణయం