Andhra News: ఆరోగ్య శ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు - సీఎం జగన్ కీలక నిర్ణయం
Aarogya Sri Scheme: ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు.
AP Government Increase Aarogyasri Scheme Limit 25 Lakhs: ఆరోగ్య శ్రీ పథకంపై (Aarogya Sri) ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయించారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో వంటి ఎంత పెద్ద జబ్బులకైనా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ కింద అందించే చికిత్సల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంచారు. ఇక క్యాన్సర్ వంటి వాటికి అందించే చికిత్సకు సైతం పరిమితి లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది.
1.42 కోట్ల మందికి కార్డులు
ఈ సందర్భంగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, గృహ సారథులు, వాలంటీర్లను ఉద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్ధేశం చేస్తారు. అనంతరం ఈ నెల 19 నుంచి 1.42 కోట్ల మందికి కొత్తగా రూపొందించిన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 'ఆరోగ్య శ్రీ' పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యానికి సీఎం జగన్ భరోసా ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో క్యాన్సర్ చికిత్సకు ఈ పథకం కింద రూ.5 లక్షల పరిమితి ఉండేదని, ఆ తర్వాత ఎంత ఖర్చైనా రోగులే భరించాల్సి వచ్చేదని తెలిపారు. ఇప్పుడు పరిమితి ఎత్తేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారు.
అందరికీ అభయం
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ నాటికి ఆరోగ్య శ్రీ పథకం కింద 37,40,525 మంది ఉచితంగా వైద్య సేవలు అందుకున్నట్లు అధికారిక సమాచారం. వీరి వైద్యం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చికిత్స ఖర్చు వెయ్యి దాటితే ఉచితంగా ఈ పథకం కింద వైద్యాన్ని అందిస్తోంది. మరోవైపు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,309 కోట్లు వెచ్చించింది. నాలుగున్నరేళ్లలో ఆరోగ్య శ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,168.96 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 'ఆరోగ్య శ్రీ' పథకం కింద 54 క్యాన్సర్ చికిత్సలు సహా మొత్తం 3,257 ప్రొసీజర్లు అందుబాటులోకి తెస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.