Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
Cyclone Fengal Effect:
IMD Rain Alert For AP And Tamil Nadu: గత రెండు రోజులు కలవరపెట్టిన 'ఫెంగల్' తుపాను (Fengal Cyclone) పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి తీరాన్ని దాటింది. పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం - కరైకాల్ మధ్య శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య ఫెంగల్ తుపాన్ తీరం దాటిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాత్రి దాదాపు 7 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు పట్టినట్లు ఐఎండీ పేర్కొంది. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తీరం వెంట బలమైన ఈదురుగాలులు..
ఇది పశ్చిమ- నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాతో పాటు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
District forecast of Andhra Pradesh dated 30-11-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/pRuiXqMct3
— MC Amaravati (@AmaravatiMc) November 30, 2024
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు- ఐఎండీ రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్
నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నేడు ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, యానాం, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలతో పాటు అధికారులను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు బీభత్సం సృష్టించాయి.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) November 30, 2024
తెలంగాణపై ఫెంగల్ తుపాను ప్రభావం, పలు జిల్లాల్లో వర్షాలు
ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణపై సైతం ఫెంగల్ తుపాను ప్రభావం చూపుతోంది. రాత్రి ఫెంగల్ తీరాన్ని దాటగా, వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.