Rishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP Desam
2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసుకున్న కేసులో గుంటూరు కోర్టు ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఘటన జరిగిన 9 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆ కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపల్ బాబూరావు ప్రైవేటు ప్లేస్‌లో ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్‌తో పాటు పలువురు విద్యార్థులు మద్యం సేవించారని.. అనంతరం విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని, సీనియర్ విద్యార్థులు సైతం ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదైంది.ఆ వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా రిషితేశ్వరి నోట్ రాసింది. అప్పట్లో రిషితేశ్వరి ఆత్మహత్య సంచలనంగా మారి పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సుదీర్ఘ విచారణ తర్వాత గుంటూరు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. ఇక న్యాయం కోసం పోరాడే ఓపిక తమకు లేదని బోరున విలపించారు.