Pruthvi Raj: 'అంబటి ఓడిపోతే జబర్థస్త్ షోలకు పనికొస్తారు' - నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు
Andhra News: నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమిదే విజయమని, అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందుతుందని స్పష్టం చేశారు.
Actor Pruthvi Raj Sensational Comments on Ycp Leaders: ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని నటుడు పృథ్వీరాజ్ (Pruthvi Raj) ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి (Satyasai District) జిల్లా బుక్కపట్నంలో (Bukkapatnam) శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఆయన, ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. వైసీపీ నేతల నోర్లు ఫినాయిల్ తో కడిగినా మారవని, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ కామెడీ షోలకు పనికొస్తారని ఎద్దేవా చేశారు. అంబటిలా తాను డ్యాన్స్ చేయలేనని, తాను పవన్ కల్యాణ్ సినిమాలో వేసిన శ్యాంబాబు పాత్రపై ఏడ్చాడని ఆరోపించారు. తాను డైలాగ్స్ చెప్పడం, పరుగెత్తడం చేస్తానని, రాంబాబు మాదిరిగా డ్యాన్సులు చేయలేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నిజంగా వైసీపీకి 175కు 175 సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు శాంతి, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు.
మంత్రి రోజాపైనా విమర్శలు
మంత్రి రోజాకు అహంకారం ఎక్కువని, అందుకే ఆమెపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. సొంత పార్టీలో మహిళా మంత్రులు కానీ, ప్రజా ప్రతినిధులు ఎవరూ ఆమెకు మద్దతు తెలపలేదని పృథ్వీరాజ్ అన్నారు. 'వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుంది. నారా లోకేశ్ యువగళం ముగింపు సభ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభలా ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలో మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైంది. బలిజల ఐక్యత ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల ఫలితాల్లో తెలుస్తుంది. అధికార పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టేలా మాట్లాడినా, కవ్వింపులకు దిగినా ఆవేశాలకు లోను కావొద్దు.' అని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై
వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని పృథ్వీరాజ్ (PruthviRaj) అన్నారు. అనకాపల్లి (Anakapalli) నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే, అధికార పార్టీ నుంచి జంపింగ్ జపాంగ్ లు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పలికారని, రాష్ట్రంలో మరో నాయకుడు ఎదగకూడదు అని అనుకుంటే ఎవరైనా భూ స్థాపితం కావాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, పేదలు, రైతులు, నిరుద్యోగులకు మేలు కలగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అద్భుతాలు జరుగుతాయని అన్నారు.
Also Read: Kodali Nani: ఎంత మంది పీకేలను పెట్టుకున్నా జగన్‌ను ఏం పీకలేరు - కొడాలి నాని సెటైర్లు