Telangana News: 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు ఇచ్చి నిలబడాలా?' - ఉచిత బస్సు ప్రయాణంపై ఓ ప్రయాణికుడి ఆవేదన
Free Bus Journey: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు.
A Man Questioned CM Revanth on Free Bus Service Scheme: తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం (Mahalaxmi Scheme) పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) ఉచిత ప్రయాణం (Free Service) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ఫ్రీ సర్వీస్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ సౌకర్యం తమకు ఎంతో మేలు చేస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పథకం వల్ల తమకు సీట్లు లేకుండా పోతున్నాయని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చాడు. 'సీఎం రేవంత్ రెడ్డి గారూ డబ్బులు పెట్టి మేము నిలబడాలా.?' అని ప్రశ్నించాడు. బస్సుల్లో మొత్తం ఉచితంగా ప్రయాణించే మహిళలే ఉన్నారని, డబ్బులు చెల్లించి మరీ తాము నిల్చోవాల్సి వస్తోందని మండిపడ్డాడు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరాడు.
ప్రయాణికుడి ఆవేదన ఇదీ
'సీఎం రేవంత్ రెడ్డి గారూ.. హైదరాబాద్ నుంచి వస్తున్నా. డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాం. అలాగే నిలబడి ప్రయాణించాలంటే మా వల్ల కావడం లేదు. మహిళల కోసం ప్రత్యేక బస్సులైనా కేటాయించండి. లేకుంటే పురుషులకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించేలా చూడండి. లేకుంటే ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేయండి. బస్సులో పూర్తి రద్దీ ఉంది. కనీసం 70, 80 కి.మీల వరకూ అంత దూరం నిలబడి ప్రయాణించడం ఇబ్బందిగా ఉంది. ఓసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారూ.!' అంటూ ఓ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ అవుతోంది.
టికెట్ కొని బస్సులో నిలబడి ప్రయాణించాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఆవేదనని వ్యక్తపరిచిన ప్రయాణికుడు pic.twitter.com/kTkhhJmu5U
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2023
ప్రత్యేక సీట్ల కోసం డిమాండ్
కాగా, ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని రహదారిపై నిరసన తెలిపాడు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులన్నీ నిండిపోతున్నాయని, పురుషులకు కనీసం వసతి కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రహదారిపై వెళ్తున్న బస్సు ముందు నిలబడి ఆందోళన చేశాడు. పురుషులకు బస్సుల్లో కనీసం 15 సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.
అప్పట్లోనే మీమ్స్ వైరల్
'స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.' ఇది అన్నీ ఆర్టీసీ బస్సుల్లోనూ కనిపించే స్లోగన్. అయితే, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఈ స్లోగన్స్ పై కొన్ని కొత్త మీమ్స్ సైతం వైరల్ అయ్యాయి. 'పురుషులను గౌరవించాలి.. వారికి కొన్ని సీట్లు కేటాయించాలి' అంటూ మీమ్స్ తెగ హల్చల్ చేశాయి. ఓ వైపు మహిళలు ఈ పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా, పురుషులు సీట్లు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదే అయినా, తమకు సీట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని, రద్దీ వల్ల దూర ప్రయాణాలు నిలబడి చేయలేకపోతున్నట్లు వాపోయారు. లేకుంటే రద్దీ ఉండే రూట్లలో అదనపు సర్వీసులైనా నడపాలని కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: Hyderabad Fire Accidents: ఫైర్ జోన్‌లా మారుతున్న హైదరాబాద్- 2023లో పెరిగిన అగ్ని ప్రమాదాలు