Amaran Movie Review - అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
Amaran Review In Telugu: శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్' తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
రాజ్ కుమార్ పెరియసామి
శివకార్తికేయన్, సాయి పల్లవి, రాహుల్ బోస్, గీతా కైలాష్, భువన్ అరోరా తదితరులు
Amaran Movie Review In Telugu: శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో కలిసి లోక నాయకుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించారు. ఇది బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. మరి, ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Amaran Movie Story): ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్)ది చెన్నై. కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పరిచయం అవుతారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే... ముకుంద్ ఆర్మీలో చేరాడని ఇందు నాన్న, మతాలు వేరని కుటుంబ సభ్యులు మొదట పెళ్లికి ఒప్పుకోరు. ఇటు ముకుంద్ తల్లి కూడా ఇందు మతం వేరని మొదట అనాసక్తి చూపిస్తుంది.
ఇందు తండ్రిని, కుటుంబ సభ్యులను ముకుంద్ ఎలా ఒప్పించాడు? ఆర్మీలో చేరిన తర్వాత అంచలంచలుగా ఎలా ఎదిగాడు? ముఖ్యంగా కశ్మీర్ లోయలోని తీవ్రవాదులను ఎలా అణచివేశాడు? అతను ప్రాణాలు ఎలా కోల్పోయాడు? ఈ ప్రయాణంలో భర్త గురించి ఇందు ఎంత ఆలోచించింది? ఆమెకు ముకుంద్ ఏం చెప్పాడు? వాళ్లిద్దరి బంధం ఎలా ఉంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Amaran Review Telugu): బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్, అందులోనూ ఆర్మీ నేపథ్యంలో సినిమా తీసేటప్పుడు కథ, కథనాలు ఎలా ఉంటాయో సగటు ప్రేక్షకులు ఊహించడం కష్టం కాదు. తీవ్రవాదం మీద సైనికులు ఉక్కుపాదం మోపే సన్నివేశాల్లో కావాల్సినంత హీరోయిజం ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. 'అమరన్'లోనూ అంతే! అయితే... ఎమోషన్ యాంగిల్, ముఖ్యంగా ముకుంద్ - ఇందు మధ్య అనుబంధం సర్‌ప్రైజ్ చేస్తుంది. మనకు తెలియకుండా మనచేత కంటతడి పెట్టిస్తుంది.
సగటు ఆర్మీ అధికారి కథగా 'అమరన్' మొదలైంది. మధ్య తరగతి తల్లి ఎవరైనా కొడుకు ఆర్మీలోకి వెళతానని అంటే వద్దని అంటుంది. ఈ సినిమాలోనూ అంతే! ముకుంద్ - ఇందు ప్రేమకథ సైతం కొత్తగా అనిపించదు. 'మేజర్' ఛాయలు కొంత కనిపిస్తాయి. అయితే... సాయి పల్లవి ఎక్స్‌ప్రెస్సివ్ నటన లోపాల్ని కప్పేసింది. ఈ సినిమాలో పీక్ లెవెల్ పాయింట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలైంది. ఆ టెర్రరిస్ట్ ఏరివేత ఆపరేషన్ అప్పటి వరకు జరిగిన కథను మరచిపోయి ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసేలా చేసింది. ఇంటర్వెల్ తర్వాత ఆర్మీ ఆపరేషన్స్, కశ్మీర్ లోయలో ఘటనల కంటే ముకుంద్ - ఇందు మధ్య సన్నివేశాలు హృదయానికి ఎక్కువ హత్తుకుంటాయి.
ఆర్మీ నేపథ్యంలో ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కుటుంబ సభ్యుల పరిస్థితి చూపించారు. అయితే... సాయి పల్లవి నటన ఆయా సినిమాల నుంచి 'అమరన్'ను వేరు చేసింది. భర్త ఇంటికి వచ్చినప్పుడు గానీ, భర్త మరణించాడని తెలిశాక గానీ... ఆయా సన్నివేశాల్లో సాయి పల్లవి నటన ఆమె ఎంత గొప్ప నటి అనేది చెబుతుంది. చెమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన గుండెతో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చారంటే కారణం సాయి పల్లవి నటన అని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.
దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి సాయి పల్లవి ఎమోషన్ (ఆర్మీ అధికారుల ఫ్యామిలీ ఎమోషన్) ఆడియన్స్ ఫీలయ్యేలా తీయడంలో సక్సెస్ అయ్యారు. దాంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉద్వేగానికి లోను అవుతారు. దర్శకుడికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ నుంచి మంచి మద్దతు లభించింది. సాంగ్స్ ఓకే. కానీ, నేపథ్య సంగీతంలో జీవీ తన టాలెంట్ చూపించారు. ముకుంద్ మరణ వార్త భార్యకు తెలిసిన సమయంలో కాసేపు నిశ్శబ్దం ఇవ్వడం వల్ల ప్రేక్షకులు ఆలోచనలు సైతం ఒక్క క్షణం ఆగుతాయి. సాయి పల్లవి ఏడుస్తుంటే స్క్రీన్ ముందు ఉన్న ప్రేక్షకులు కంటతడి పెడతారు. సినిమాటోగ్రఫీ బావుంది. కశ్మీర్ ను బాగా క్యాప్చర్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ టాప్ క్లాస్ అని చెప్పాలి.
Also Read: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
ఇప్పటి వరకు శివకార్తికేయన్ చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. బాయ్ నెక్స్ట్ డోర్, లోకల్ యూత్, కమర్షియల్ ఫార్ములా కథల నుంచి ఆయన బయటకు వచ్చారు. బరువైన పాత్ర పోషించారు. ముకుంద్ జీవితంలో వివిధ దశలకు తగ్గట్టు లుక్ పరంగా వేరియేషన్, నటుడిగా పరిణితి చూపించారు. రాహుల్ బోస్, భువన్ అరోరా, గీతా కైలాష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆ పాత్రల పరిధి మేరకు నటించారు.
అమరన్... దేశం కోసం కుటుంబానికి, సరదాలకు దూరంగా పోరాటం చేసే మన సైనికులకు ఇచ్చిన చక్కటి నివాళి. సైనికుల త్యాగాలను మాత్రమే కాదు, ఆర్మీలోకి వెళ్లిన వ్యక్తులకు కుటుంబ సభ్యులు ఇచ్చే నైతిక మద్దతుతో పాటు వాళ్ళ త్యాగాలను సైతం చూపించిన చిత్రమిది. బరువెక్కిన గుండెతో ప్రేక్షకులను బయటకు పంపే చిత్రమిది.
Also Read: క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?