World Lung Cancer Day: నిరంతరం దగ్గు వస్తుందా? విస్మరించొద్దు, ఆ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది
పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. దీని వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిణామాలు గురించి తప్పక తెలుసుకోవాలి.
మద్యపానం, ధూమపానం అలవాటు వల్ల అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. దీని గురించి అవగాహన కల్పించడం కోసం ఏటా ఆగస్టు 1న ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇదొక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) నవంబర్ ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తించింది. 2020 లో దాదాపు 1.8 మిలియన్ల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించారు.
రోగనిర్ధారణ ఆలస్యం
వ్యాధి ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో నిర్లక్ష్యం వల్ల లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆలస్య రోగ నిర్ధారణ, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ చివరి స్టేజ్ వరకు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. పొగాకు నియంత్రణ చర్యలు, పర్యావరణ ప్రమాద కారకాలకు గురి కావడం తగ్గించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభావ్యతని తగ్గించుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చు.
ప్రారంభ సంకేతాలు
ముందస్తుగా గుర్తించి, సకాలంలో చికిత్స చేయడం వల్ల వ్యాధి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నిరంతర దగ్గు వస్తుంటే దాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణ ప్రారంభ లక్షణంగా గుర్తించాలి. ఇది పొడిగా లేదంటే శ్లేష్మం కూడా ఉత్పత్తి చేయవచ్చు. శ్వాస ఆడకపోవడం లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఛాతీ నొప్పికి కారణం కావచ్చు. లోతైన శ్వాస తీసుకుంటున్నప్పుడు లేదంటే దగ్గుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. శారీరక శ్రమలో ఎటువంటి మార్పులు లేకుండా బరువు తగ్గిపోతారు. నిరంతరం అలసట, గొంతు బొంగురు పోవడం, దగ్గేటప్పుడు రక్తం రావడం కూడ మరికొన్ని లక్షణాలు.
కారణాలు ఏంటి?
ఊపిరితిత్తుల క్యాన్సర్ కి సిగరెట్ తాగడం ప్రధాన కారణం. పొగాకు పొగలో అనేక క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను కప్పే కణాలను దెబ్బతీస్తాయి. ధూమాపనం చేయని వారితో పోలిస్తే ధూమపానం చేసే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. పొగ తాగే వారి పక్కన ఉన్న వారికి కూడా దీని ప్రమాదం కొంత మేరకు ఉంటుంది. రేడియోధార్మిక వాయువుకి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వాయు కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దోహదపడుతుంది. ఇవి కాకుండా జన్యుపరమైన కారకాలు, రేడియేషన్ కు గురికావడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబ చరిత్రను కలిగి ఉండటం కూడా ఈ క్యాన్సర్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం
సిగరెట్లు అధికంగా తాగే వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ధూమపానం చేసే వారితో పాటు పొగ వాతావరణంలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు కూడా ప్రమాదం అంచున ఉన్నట్టే. COPD వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, ఛాతీ ప్రాంతంలో రేడియేషన్ చికిత్స పొందిన వాళ్ళు ఈ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇమ్యునోథెరపీ, యాంటీ యాంజియోజెనిక్ థెరపీ వంటి చికిత్సలు వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇంటర్నెట్ లో కనిపించే ఫ్యాన్సీ డైట్ ఫాలో అవడం నివారించాలి. న్యూట్రోపెనిక్ ఆహారాలు అసలు తీసుకోవద్దు. పండ్ల రసాలకు బదులుగా పండ్లు తినడం మంచిది. స్నేహితులు, బంధువులు చెప్పే సలహాలు అసలు పాటించకూడదు. భౌతిక, సంగీత చికిత్స, శారీరక స్థితికి అణుగుణంగా వ్యాయామం వంటి వాటిని చేయడం మంచిది. ధూమపానం వదిలేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బీకేర్ ఫుల్, నిద్రలేమి వల్ల మీ మెదడు ప్రతికూల ప్రభావం