World Left-Handers Day: ఎడమ చేతివాటం పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
World Left-Handers Day: ఎడమ చేతివాటం పిల్లల పట్ల తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ఆ విషయాలు చూద్దాం.

World Left Handers Day: మనం రెగ్యులర్‌గా చూసే మనుషుల్లో కొందరు ఎడమ చేతితో రాస్తుంటారు. ఎడమ చేతితో పనులు చేస్తుంటారు. అలాంటి వారందర్ని ఎడమ చేతివాటం వ్యక్తులు అంటారు. అలాంటి వారందరి కోసం ప్రత్యేకమైన రోజు ఉంది. అదే లెఫ్ట్ హ్యాండర్స్‌డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ జరుపుకునే రోజు అన్నమాట. అందరిలో వారు భిన్నంగా కనిపిస్తారు. ఇలా ఎడమచేతి వాటంతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే టైంలో మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ప్రతి వంద మందిలో 90 మంది కుడి చేతివాటం కలిగి ఉంటారు. కేవలం పది శాతం మంది మాత్రం ఎడమ చేతివాటం మనుషులు ఉంటారు. అలా ఎడమ చేతితో రాస్తూ పనులు చేసే వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మేధోశక్తిలో, ఆలోచనల్లో, పనులు చక్కబెట్టడంలో అందరి కంటే భిన్నంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మేథావుల్లో చాలా మంది ఎడమచేతి వాటం కలిగి ఉన్నారు.
ఎడమ చేతివాటం ప్రముఖులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, అమితాబ్ బచ్చన్, రతన్ టాటా, సావిత్రి, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, యూకే మాజీ ప్రధానమంత్రులు డేవిడ్ కామెరాన్, విన్‌స్టన్ చర్చిల్, సెలబ్రిటీలు ఓప్రా విన్‌ప్రే, లేడీ గాగా,పాల్ మెక్‌కార్ట్నీ, జిమ్మి హాండ్రిక్స్ ఇలా చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్. వీళ్లను సినిస్ట్రల్ పీపుల్ అంటారు.
పిల్లలు వయసు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్యలో ఉన్నప్పుడే చేతివాటం ఏంటో తెలిసిపోతుంది. వారు ఎక్కువ ఎడమ చేతితో పనులు చేస్తుంటే వారు ఎడమ చేతి వాటంగా గుర్తించాలి. ఇలాంటి సమయంలో చాలా మంది బలవంతంగా వారిని కుడి చేతి వాటంగా మార్చాలని చూస్తారు. ఇలా చేయడం మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ వయసులో వాళ్లతో బలవంతంగా ఇలా చేయడం వల్ల మానసికంగా ఇబ్బంది పడతారని చేతివాటం మార్చుకునేందుకు ఇబ్బందిపడతారని అలా చేయొద్దని సూచిస్తున్నారు.
ఎడమ చేతి వాటం వాళ్లు ఛాంపియన్స్
ఎడమచేతి వాటం కలిగిన వ్యక్తుల్లో క్రియేటివిటీ, కళల పట్ల ఆసక్తి, నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి సహజ సిద్ధంగానే పుట్టినప్పటి నుంచి కొన్ని నైపుణ్యాలను కలిగి ఉంటాడు. అలాంటి వాటిలో ఈ ఎడమ, కుడి చేతివాటాలు కూడా ఒకటని అంటారు. మన మెదడులో ఉండే రెండు అర్థభాగాలు మన శరీరాన్ని నియంత్రిస్తుంది. కుడివైపు భాగాలను ఎడమవైపు మెదడు, ఎడవైపు భాగాలను కుడి మెదడు గైడ్ చేస్తుంది. కుడి వైపు మెదడు భాగం బలంగా ఉన్నవారికి ఎడమచేతివాటం అలవాటు అవుతుంది. అందుకే మల్టీ టాస్కింగ్ చేయడం అందరికంటే ముందు ఉంటారు.
ఛాలెంజ్‌లు
ఎడమచేతి వాటం కలిగిన వ్యక్తులు చాలా ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుడిచేతివాటం డామినేషన్ ఉన్న సమాజంలో ఎడమచేతివాటం మనుషులు తమ పనులు ఈజీగా చేసుకోలేరు. ఇప్పుడు కీబోర్డు మొత్తం కుడి చేతివాటం వాళ్ల కోసం డిజైన్ చేసిందే... వాటిపై పని చేయాలంటే లెఫ్ట్ హ్యాండర్స్‌కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ల్యాప్‌టాప్ వాడకం, మూతలు తీసే యంత్రాలు, బుక్స్, కత్తెరలు ఇలా చాలా వస్తువు వాడటంలో వారు ఇబ్బంది పడతుంటారు. అందుకే వారికి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎడమ చేతి వాటం పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా మంది ఎడమ చేతి వాటం తప్పుగా భావిస్తారు. అందుకే పిల్లలతో బలవంతంగా కుడిచేతి వాటంగా మార్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ప్రమాదకరం. పిల్లాడి మైండ్‌లో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మీరు మధ్యలో ఒకటి చెప్పడంతో రెండూ క్లాష్ అయ్యి రెండు చేతులతో ఏ పని చేయకుండా అయిపోతాడు. అందుకే వారికి నచ్చిన చేతితో రాసేలా ప్రోత్సహించాలి.
మీ ఇంట్లో వాడే వస్తువులను కూడా ఎడమ చేతి వాటం వస్తువులు ఉంచాలి. అప్పుడు మీ పిల్లల మానసిక పరిణితి బాగా ఉంటుంది. లేకుంటే కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. స్కూల్ టీచర్స్‌తో, మీ పిల్లల ఫ్రెండ్స్‌తో తరచూ మాట్లాడుతూ ఎడమ చేతి వాటం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని రెక్టిఫై చేసేలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.





















