మేనరికపు పెళ్లిళ్లు ఎందుకు వద్దని చెబుతున్నారు? పిల్లల్లో అవకరాలు కచ్చితంగా వస్తాయా?
ఒకప్పుడు మేనరిక సంబంధాలే చేసుకునేవారు, ఇప్పుడు వద్దని వారిస్తున్నారు వైద్యులు.
మేనరిక సంబంధాలు చేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ఇంకా ఎంతో మంది రక్తసంబంధీకులనే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇలా మేనరికాలు చేసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు, అవకారాలు వస్తాయని నమ్మకం. ఇది నిజమేనని సైన్సు కూడా చెబుతోంది. పూర్వం బిడ్డ పుట్టాక కాళ్లు, చేతులు, వేళ్లు అన్ని చూశాక, ఎలాంటి లోపాలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే పండంటి బిడ్డ పుట్టిందని ప్రకటించేవారు. ముఖ్యంగా మేనరికం చేసుకున్నవారిలోనే బిడ్డలు ఏదో ఒక లోపంతో పుట్టడం లేక, ఎదిగే క్రమంలో శారీరక లేక మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం వంటివి బయటపడతాయి. ఆ బిడ్డ జీవితమంతా ఆ బాధతోనే బతకాలి. అందుకే మేనరికపు వివాహాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. బిడ్డలు ఆరోగ్యంగా కావాలా? అయితే మేనరికపు వివాహాలు చేసుకోకండి అని వైద్యశాస్త్రం ఎప్పట్నించో చెబుతోంది.
మేనరికంలోనే ఎందుకు?
ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను లేదా, దూరపు సంబంధం ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటే రాని సమస్యలు, మేనరికపు సంబంధంలోనే ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం జన్యువులు. తల్లిదండ్రుల డీఎన్ఏ తరతరాలకు వారసత్వంగా వెళుతుంది. మేనరికం సంబంధాలంటే అన్నదమ్ముల పిల్లలను, అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇస్తారు. అలాగే మేనమామలను లేదా మేన కోడళ్లను పెళ్లి చేసుకునే సంప్రదాయం ఉంది. ఇవన్నీ మేనరిక పెళ్లిళ్ల కిందకి వస్తాయి. వీరందరి జన్యు మూలాలు ఒకే వ్యక్తుల నుంచి వస్తాయి. అంటే వీరిలో జన్యువుల మ్యూటేషన్ ఉండదు. ఒకరి జన్యువుల్లో లోపం ఉంటే, మరొకరి జన్యువుల్లో కూడా అదే లోపం ఉండే అవకాశం ఉంది. రెండు లోపభూయిష్టమైన జన్యువులు కలిస్తే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశం తక్కువ.
ఇంకా వివరంగా చెప్పాలంటే...
ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి నుంచి సగం జన్యువులు, తండ్రి నుంచి సగం జన్యువులు అవసరం. అవి కలిసి ఆరోగ్యకరమైన పిండాన్ని జనించేలా చేస్తాయి. అయితే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరి జన్యువుల్లో లోపం ఉంటే, లోపం లేని మరొకరి జన్యువు డామినేట్ చేస్తుంది. అంటే లోపం ఉన్న జన్యువును తొక్కి పెట్టి, ఆరోగ్యకరమైన జన్యువు కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటప్పుడు బిడ్డ అనారోగ్యంతో, అవకరాలతో పుట్టే అవకాశం ఉండదు. అదే తల్లిదండ్రులిద్దరి జన్యు మూలాలు ఒక వ్యక్తి నుంచే వచ్చినవి అయితే, ఇద్దరి జన్యువుల్లోనూ లోపాలు ఉంటాయి. మేనరికపు వివాహాల్లో ఇద్దరి జన్యువుల మూలాలు ఒక వ్యక్తి నుంచి వచ్చినదే ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి పుట్టే పిల్లల్లో ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది.
మేనరికపు వివాహాలు కాని వారికి కూడా అవకరాలు ఉన్న పిల్లలు, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పుడుతున్నారు కదా అనే సందేహం రావచ్చు... అది నిజమే. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు పెళ్లి చేసుకుంటే, అలాంటి వారిలో 400 జంటల్లో ఒక జంటకు అవకరాలు ఉన్న బిడ్డ పుట్టే అవకాశం ఉంది. కానీ మేనరికపు వివాహాల్లో 200 జంటల్లో ఒక జంటకు లోపాలతో పిల్లలు పుట్టే ఛాన్సు ఉంది. అందుకే మేనరికపు వివాహాలు వద్దని సైన్సు కూడా చెబుతోంది.
Also read: వాతావరణం చల్లగా ఉందని నాలుగైదు సార్లు టీలు, కాఫీలు తాగేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.