మీ పార్టనర్ ఇలా ప్రవర్తిస్తున్నాడా? జాగ్రత్త, మీ ప్రాణాలకు ముప్పు ఉండొచ్చు, ఈ తప్పులు చేయొద్దు
సన్నిహితుల నుంచి దూరం చేసే ఏ రిలేషన్ షిప్ అయినా టాక్సిక్ అని గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ రిలేషన్ షిప్ ఎలా ఉందో ఒకసారి సరిచూసుకొమ్మని సూచిస్తున్నారు
ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. అసలు రిలేషన్ షిప్ ఎప్పుడు టాక్సిక్ అవుతుంది? ఎలాంటి సందర్భాల్లో రిలేషన్ షిప్ నుంచి బయట పడాల్సిన అవసరం ఉంటుంది? వంటి విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం ద్వారా ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటపడొచ్చు. అవేంటో చూసేయండి. ముందుగా హత్యకు గురవ్వడానికి ముందు శ్రద్ధ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుందో చూడండి.
కుటుంబానికి ఇష్టం లేకపోయినా శ్రద్ధ తను ప్రేమించిన ఆఫ్తాబ్ తో కలిసి ఉండేందుకు 201 లో ఇంట్లోంచి వచ్చేసింది. ఆమె సన్నిహితులు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ల రిలేషన్ షిప్ మొదటి నుంచి కూడా టాక్సిక్ గానే ఉండేదని అర్థమవుతోంది. చాలా సార్లు శ్రద్ధ ఒంటి మీద భౌతిక హింసకు సంబంధించిన ఆనవాళ్లు గమనించామని స్నేహితులు చెప్తున్నారు. కొంత కాలం క్రితమే ఆమె.. అతడి నుంచి విడిపోవాలని అనుకుందని కూడా అంటున్నారు.
మరి ఆమె ఎందుకు ఆ బంధం నుంచి బయటకు రాలేకపోయింది? అనేదే చిక్కు ప్రశ్న. అయితే, అలా ఆమె బయటకు వెళ్లి పోతే ఆఫ్తాబ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచాడని ఆమె సన్నిహితుల్లో ఒకరు వెల్లడించారు. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా స్నేహితులతో టచ్ లో ఉందనే అంటున్నారు. కానీ కొద్ది రోజులుగా ఆమె సమాచారం పెద్దగా తెలియలేదని కూడా చెబుతున్నారు. అయితే, ఆమె బంధం ప్రమాదకరంగా మారుతుందని తెలిసినా.. వదిలించుకోలేకపోయిందని, చివరికి ప్రాణాలు కోల్పోయిందని అంటున్నారు. దీనిపై మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.
మానసికంగా బాధపెట్టడం, భౌతికంగా హింసించడం, ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించడం వంటివన్నీ కూడా రెడ్ ఫ్లాగ్సే అని మానసిక నిపుణులు అంటున్నారు. మనలో చాలా మంది మహిళలకు వారి సైకలాజికల్, ఎమోషనల్ హక్కుల గురించి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. అదే సైకో గాళ్లకు వరంగా, మహిళలకు శాపంగా మారుతోంది.
రెస్పెక్ట్ ఫస్ట్
ఏ రిలేషన్‌షిప్‌కైనా ఎదుటి వారి పట్ల గౌరవం ఉండడం అనేది అత్యంత ప్రాథమికమైన విషయం. ప్రతి రిలేషన్ షిప్ కు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటకూడదన్న ఇంగితం తప్పనిసరి. భాగస్వామి గతాన్ని, వర్తమానాన్ని అంగీకరించాలి. వారి అంగీకారానికి, తిరస్కారానికి విలువనివ్వాలి. అప్పుడే అది పరస్పర గౌరవం కలిగిన అనుబంధం అవుతుంది. అలా కాకుండా పొజెసివ్ నెస్, జెలసీ మీ పార్టనర్ లో కనిపిస్తే మాత్రం ఆ రిలేషన్ షిప్ సరైంది కాదని గుర్తించాలని అరోబా కబీర్ అనే మెంటల్ హెల్త్ కౌన్సెలర్ ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. అంతేకాదు రిలేషన్ షిఫ్ లో ఉన్నపుడు మనసులో మాట నిర్భయంగా బయట పెట్టగలిగే స్వేచ్ఛ తప్పకుండా ఉండాలని కూడా ఆమె చెబుతున్నారు. మీకు కలుగుతున్న అసౌకర్యం గురించి చర్చించినా సరే పదేపదే అసౌకర్యం కలిగించడం కూడా గౌరవభంగంగా గుర్తించాలని, గౌరవం లేకపోవడం అనేది మొట్టమొదటి రెడ్ ఫ్లాగ్(ప్రమాద సూచిక)గా భావించాలని కూడా ఆమె తెలిపారు.
అపరాధ భావం
ఇలాంటి సందర్భాల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నామన్న అపరాధ భావం ఆ రిలేషన్ షిప్ లోనుంచి బయట పడేందుకు అడ్డంకిగా మారుతుంది. శ్రద్ధ విషయంలో జరిగింది అదే అని చెన్నైకి చెందిన ఓ సైకియాట్రిస్ట్ తెలిపారు. ఇలాంటి టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నామన్న అనుమానం కలిగినపుడు తప్పనిసరిగా ఆత్మీయులతో తమ సమస్యల గురించి చర్చించాలి. ఇబ్బంది ఎక్కువైనపుడు పర్సనల్ అని అన్ని విషయాలు దాచుకోవడం ప్రమాదకరం అని అంటున్నారు పద్మావతి.
పర్సనల్ స్పేస్
వ్యక్తులుగా మనకు మన జీవితంలో కొంత స్థానం లేని రిలేషన్ షిప్ ఎప్పుడైనా టాక్సిక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే పర్సనల్ స్పేస్ అంటారు. మీకు ఇష్టం లేని పనులు చెయ్యమని బలవంత పెట్టడం లేదా ఇష్టమైన పనులు చెయ్యనివ్వక పోవడం, ఫోన్లు చెక్ చెయ్యడం, పాస్ వర్డ్ లు తనకు తెలిసి ఉండాలని అనడం, నిరంతరం ఫైనాన్షియల్ విషయాలు ట్రాక్ చేస్తూ ఉండడం, ఫలనా వారితో మాట్లాడకూడదని బలవంత పెట్టడం వంటివన్నీ కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వకపోవడం, అగౌరవ పరచడం కిందకు వస్తాయని.. ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఎలా బయట పడాలి?
ముందుగా మన అనుబంధం ఆరోగ్యకరంగా ఉందో లేదో తెలుసుకోగలిగే అవగాహన ఉంటే అందులో నుంచి బయటపడాల్సిన అవసరం అర్థం అవుతుంది.
- భాగస్వామి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడడం అనేది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం.
- ముఖ్యంగా మహిళలు ప్రతి విషయానికి తల ఊపూతూ, చెప్పిన ప్రతి పని చెయ్యాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి.
- చెప్పిన మాట వినలేదని భౌతికంగా హింసించడం లేదా మాటలతో బాధ పెట్టడం అనేది మరో ప్రమాద సూచికగా గుర్తించాలి.
- కొన్ని సార్లు చెప్పిన మాట వినలేదని పదిమంది లో కూడా అవమాన పరుస్తుంటారు. లేదా అందరి ముందు ఆమె గురించి చులకనగా మాట్లాడుతుంటారు. ఇది మీ గౌరవానికి భంగం కలిగించడం అని తెలుసుకోండి. అది జోక్ గా కొట్టిపడేసే విషయం కాదని గుర్తించాలి.
- ప్రతి విషయానికి అనుమతి తీసుకోవడం, ఎక్కడికి వెళ్లనివ్వక పోవడం వంటి వన్నీ కూడా టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గా భావిస్తాను.
అవతలి వారిని ఎమోషనల్ గా లేదా ఫిజికల్ గా బెదిరిస్తున్నారంటే వారు మానసికంగా చాలా ఒంటరిగా, బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. టాక్సిక్ పార్టనర్ ఎప్పుడైనా ముందుగా చేసే పని మీకు సన్నిహితులైన వారి నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. సన్నిహితులైన వారు ద్గరగా ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు కనుక.
బలహీనులే బెదిరిస్తారు
ముఖ్యంగా ఆత్మ హత్య చేసుకుంటామని బెదిరించే వారు మానసికంగా చాలా బలహీనులని అర్థం చేసుకోవాలి. వీళ్లకు తక్షణమే దూరంగా వెళ్లడం అవసరం. నిజంగానే ఆత్మ హత్య చేసుకుంటారని అనుమానంగా ఉంటే వారికి సహాయం చెయ్యగలిగే ఎవరికైనా వాళ్లను అప్పగించి వారి నుంచి దూరంగా వెళ్లడం ద్వారా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. వీటన్నింటికంటే ముందు అసలు ఆ రిలేషన్ షిప్ లో ఎందుకు ఉండాలి? విడిచిపోతే జరిగే నష్టం ఎలాంటిది? వంటి విషయాలను ఒకసారి విశ్లేషించి బేరీజు వేసుకుంటే ఆ రిలేషన్ షిప్ కొనసాగించాలా లేక బయట పడాలా అనే విషయం అర్థం అవుతుంది. టాక్సిక్ రిలేషన్ షిప్ ఎప్పుడైనా ప్రమాదకరమే. వీలైనంత త్వరగా గుర్తించి అందులో నుంచి బయటపడడం తప్ప మరో మార్గం ఉండదని నిపుణులు సలహా ఇస్తున్నారు.