Menstrual Pains: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు
నెలసరి సమయంలో నొప్పులు రావడం సహజం. వాటిని తగ్గించుకునేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి.
ప్రతి స్త్రీ జీవితంలో పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని రుతుక్రమం అని పిలుస్తారు. ప్రతి మహిళ నెలకి 3-5 రోజుల పాటు బహిష్టులో ఉంటుంది. అటువంటి సమయంలో నొప్పులు రావడం సహజంగానే జరుగుతుంది. పొత్తి కడుపులో నొప్పి, నడుము, కాళ్ళు బాగా నొప్పులుగా అనిపించడం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి పీరియడ్స్ రావడానికి ఒక రోజు ముందు లేదా వచ్చిన తర్వాత మొదలువుతాయి. వాటి వల్ల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని డిస్మెనోరియా అని కూడా అంటారు. 40-50% మంది మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పులు ఎదుర్కొంటున్నారు.
ఎండోమెట్రియల్ కణాలలో E2, F2a ప్రోస్టాగ్లాండిన్ ఉత్పత్తి పెరగడం వల్ల ప్రాథమిక డిస్మెనోరియా నొప్పి ప్రేరేపించబడుతుంది. పొట్టలో తిమ్మిరి, వెన్ను నొప్పు, అతిసారం, అలసట, తలనొప్పి, వికారం, వాంతులు, మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి. వీటిని చాలా మంది భరిస్తారు లేదా మందులు వేసుకుని తగ్గించుకుంటారు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుని కూడా నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
చమోమిలీ టీ
పీరియడ్ నొప్పుల నుంచి బయటపడేందుకు చామంతి పూల టీ అద్భుతమైన రెమెడీగా చెప్పొచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటి స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రుతు తిమ్మిర్లని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు కెఫిన్ లేని చమోమిలే టీ మీ శరీరాన్ని మరింత గ్లైసిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది కండరాల తిమ్మిరిని సడలించి నరాలకి విశ్రాంతినిస్తుంది.
చియా, అవిసె గింజలు
అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్రమైన పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా చియా విత్తనాల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి రెండింటిని ఓట్స్, స్మూతీస్, పెరుగు లేదా సలాడ్ పైన చల్లి అయిన తీసుకోవచ్చు.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్స్ కూడా రుతుక్రమ నొప్పులని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎండార్ఫిన్‌లు మానసిక స్థితిలో మార్పులు వచ్చేందుకు సహాయపడుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల కండరాలకి ఉపశమనం కలిగిస్తుంది. డార్క్ చాక్లెట్ లోని ఎండార్ఫిన్స్ డార్క్ చాక్లెట్‌లో నొప్పిని నివారించి, తిమ్మిరిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
అల్లం
భారతీయుల కుటుంబాల్లో తప్పనిసరిగా అల్లం ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఏదైనా కండరాల నొప్పులని ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అల్లం తీసుకుంటే వికారం, వాంతులని తగ్గిస్తుందని ఒక అధ్యయనం కూడా వెల్లడించింది. అల్లంతో చేసిన టీ లేదా వేడినీళ్ళలో నిమ్మకాయ, అల్లం ముక్కలు వేసుకుని కూడా తాగొచ్చు.
పసుపు
గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ సహజ మూలం. రుతునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పీరియడ్స్ నొప్పులు తగ్గించి మానసిక ఆనందం కూడా ఇస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: 10 నిమిషాల్లో 12 ఎనర్జీ డ్రింక్స్ తాగాడు! తర్వాత అతనికి ఏమైందో తెలుసా?