Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Telangana News: రైతు భరోసా పథకం సాగు చేసే అందరి రైతులకు వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో పథకం అమలు, విధి విదానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Cabinet Sub Committee Meeting On Rythu Bharosa: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా (Rythu Bharosa) ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరై.. రైతు భరోసా విధి విధానాలపై చర్చించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టొద్దని కమిటీ అభిప్రాయపడింది.
రైతుల నుంచి దరఖాస్తులు..
రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగుభూములు గుర్తించనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకూ దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. సాగు చేయని భూములు తీసేస్తే కోటీ 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా అందే ఛాన్స్ ఉంది. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా తమ నిర్ణయాలు ఉంటాయని.. ఈ పథకం అమలు చేస్తే రైతుల ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందనే నమ్మకం ఉందని మంత్రులు పేర్కొంటున్నారు.
కాగా, ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకం అమలుపై భేటీ అయ్యింది. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. 'ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చి తీరుతాం. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం రూ.72,659 కోట్లు కేటాయించింది. రైతు రుణ మాఫీ కింద 2 నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలని నిర్ణయించాం.
110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుంది. 2023 - 24 ఏడాదికి ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లు విడుదల చేయగా.. రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తంగా రూ.133.5 కోట్లు విడుదల చేశాం. రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు రూ.500 బోనస్‌గా ప్రభుత్వం చెల్లిస్తుంది. అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాం.' అని భట్టి పేర్కొన్నారు.
Also Read: Telangana News: తెలంగాణ ఖజానాకు న్యూ ఇయర్ కిక్- మద్యం విక్రయాలతో భారీగా ఆదాయం