Badal Babu Love: ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
Facebook Love: ఫేస్ బుక్‌లో పరిచయమైన అమ్మాయి కోసం యూపీకి చెందిన యువకుడు పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కుమారున్ని రక్షించాలని అతని పేరెంట్స్ వేడుకుంటున్నారు.
UP Young Man Who Entered Pakistan For His Facebook Lover: ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతితో రెండేళ్ల పరిచయ సరిహద్దులు దాటింది. అక్రమంగా పాక్‌లోకి ప్రవేశించిన ఆ యువకున్ని కష్టాల్లోకి నెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarapradesh) అలీగఢ్ జిల్లా ఖిత్కారి గ్రామానికి చెందిన 21 ఏళ్ల బాదల్ బాబు (Badal Babu) అనే యువకుడికి ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్‌కు చెందిన సనారాణితో పరిచయం ఏర్పడింది. గత రెండున్నరేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సదరు యువకుడు పాక్ యువతిని కలిసి పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో పని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తన కుటుంబానికి చెప్పిన బాబు.. దీపావళికి ముందు తన కుటుంబానికి వీడియో కాల్ చేశాడు. తనకు పని కుదిరిందని.. క్షేమంగానే ఉన్నట్లు చెప్పిన అతను.. మొబైల్ కొనే స్థోమత లేక స్నేహితుల ఫోన్ నుంచి వీడియో కాల్ చేసినట్లు చెప్పాడు.
అక్రమంగా పాక్‌లోకి..
తన ఫేస్ బుక్ లవర్‌ను కలిసేందుకు బాదల్ బాబు పెద్ద సాహసమే చేశాడు. జమ్ముకశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. పంజాబ్ ప్రావిన్స్ మండి బహౌద్దీన్ జిల్లాలోని సనా రాణి గ్రామానికి వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని చెప్పగా ఆమె నిరాకరించింది. అయితే, బాబు అక్రమంగా ప్రవేశించిన విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు డిసెంబర్ 28న అతన్ని అరెస్ట్ చేశారు. సనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సైతం ప్రశ్నించారు.
ప్రేమించిన మాట వాస్తవమే... కానీ..
ఈ అంశంపై సనారాణి స్టేట్‌మెంట్‌ను అక్కడి పోలీసులు రికార్డు చేశారు. బాబుతో రెండున్నరేళ్లుగా పరిచయం ఉన్న మాట వాస్తవమేనని.. అయితే, అతన్ని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. ఈ క్రమంలో బాదల్ బాబును కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 10వ తేదీ వరకూ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. అటు, ఇదే విషయాన్ని పంజాబ్ పోలీస్ అధికారి నజీర్ షా తెలిపారు. అయితే, బాదల్, రాణిలు సమావేశమయ్యారా.? అని అక్కడి మీడియా ప్రశ్నించగా.. దాన్ని తాను ధ్రువీకరించలేనని చెప్పారు.
యువకుని పేరెంట్స్ ఆందోళన
మరోవైపు, బాదల్ బాబు అరెస్ట్ విషయం తెలుసుకున్న యూపీలోని అతని కుటుంబం షాకైంది. తమ అబ్బాయిని రక్షించాలని యువకుని పేరెంట్స్ వేడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ జోక్యంచేసుకోవాలని కోరారు. ఈ మేరకు అలీగఢ్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని తెలియజేస్తానని ఆయన వెల్లడించారు.