WHO On NeoCov: నియోకోవ్ వైరస్‌పై చైనా అలా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా.. ముప్పు తప్పదా?
చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న నియోకోవ్ కొత్త వేరియెంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందన ఇది. MERS Coronavirus తరహాలోనే ఇదీ వ్యాపిస్తుందా?
కోవిడ్-19కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ ఇండియాలో వేగంగా వ్యాపించినా.. మరణాల శాతం తక్కువగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక కోవిడ్ ముప్పు తప్పినట్లేనని భావిస్తున్న తరుణంలో చైనా మరో బాంబు పేల్చింది. దక్షిణాఫ్రికాలో గబ్బిలాలలో నియోకోవ్(NeoCov) వైరస్ కోవిడ్-19 కంటే ప్రమాదకరమైనదని, కరోనా తరహాలోనే అది మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని ఉహాన్ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. ఈ వైరస్ వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది.
NeoCovపై WHO స్పందన ఇది: ఉహాన్ శాస్త్రవేత్తలు కనుగొన్న నియోకోవ్ వైరస్ మానవులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనే దానిపై మరింత అధ్యయనం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఆ సంస్థ ప్రతినిధి ఓ రష్యన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘చైనా అధ్యయనంలో కనుగొన్న వైరస్ మనుషులకు ఎంతవరకు ప్రమాదం కలిగిస్తుందనే అంశంపై తదుపరి పరిశోధన అవసరం’’ అని పేర్కొన్నారు. జూనోటిక్ వైరస్‌ల పర్యవేక్షణ, ముప్పుల గురించి తెలుసుకోడానికి WHO.. ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (OIE), WHO ఇది ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (OIE), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(UNEP)తో కలిసి పనిచేయనుందని తెలిపారు. కరోనావైరస్‌లు తరచుగా జంతువుల్లోనే కనిపిస్తాయి. వీటిలో చాలా వైరస్‌లకు గబ్బిలాలే కేంద్రం.
చైనా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?: చైనా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. నియోకోవ్ వైరస్ కూడా SARS-CoV-2 మాదిరిగానే మానవ కణాలలోకి చొచ్చుకుపోతుంది. ఇది కూడా కోవిడ్ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. పైగా, ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది కూడా. సాధారనంగా ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాపిస్తోంది. ఇది మనుషులకు వ్యాపించాలంటే.. కేవలం ఒకే ఒక మ్యూటేషన్ అవసరం. అంటే.. ఆ ఒక్క మ్యూటేషన్ పెరిగితే మనుషులకూ నియోకోవ్ వైరస్ సంక్రమిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది SARS-CoV-2 కాదు. కానీ, దీనికి MERS Coronavirusతో సంబంధం ఉంది. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశాలు ఎక్కువ.
MERS-CoV అంటే?: మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV) అనేది డ్రోమెడరీ ఒంటెల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్. ఇది జూనోటిక్ వైరస్ రకానికి చెందినది. అంటే ఇది జంతువులు, మనుషులకు సంక్రమిస్తుంది. WHO ప్రకారం.. ఈ వైరస్ సోకిన జంతువులను ప్రత్యక్ష లేదా పరోక్షంగా కలిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంది. MERS-CoV మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియాలోని అనేక దేశాలలో డ్రోమెడరీలలో గుర్తించారు. 2012 సంవత్సరంలో 27 దేశాల్లో ఈ ఒంటెల వల్ల వైరస్ వ్యాపించింది. అప్పట్లో 858 మంది చనిపోయారు.