Astronauts: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? వారికి ఉప్పు, పంచదార కూడా పంపించరా?
భూమికి, ఆకాశానికి ఎంతో తేడా. ఆ తేడా ఆయా ప్రాంతాలలో తినే ఆహారాలపై కూడా పడుతుంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం... సరిగ్గా భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. భూమిపై వాతావరణం వేరు, అంతరిక్ష కేంద్రంలో ఉన్న వాతావారణం వేరు. భూమిపై చేసే ప్రతి పనీ, అక్కడ చేయలేం. అంతెందుకు ఇక్కడ తినే తిండి కూడా అక్కడ తినలేం. వ్యోమగాములకు ఆహారం నుంచి నీటి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిది ప్రత్యేకంగా ప్యాకేజ్ చేయాల్సిందే.
ఎక్కడ తయారుచేస్తారు?
నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబోరేటరీలో ఆహార శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహారాన్ని తయారుచేస్తారు. వ్యోమగాముల్లో ఆహారం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ల్యాబ్‌లో పెద్ద కిచెన్ ఉంటుంది. అక్కడ రకరకాల వంటలను వండి చెక్ చేస్తారు. అక్కడ ఫ్రీజ్ డ్రైయర్స్, 40 గ్యాలన్ల స్టీమ్ కెటిల్, డబుల్ కన్వెన్షన్ ఓవెన్, సిక్స్ బర్నర్ స్టవ్ టాప్, మిక్సర్, క్యానర్, ఇలా చాలా ఉంటాయి. అక్కడ కేవలం వ్యోమగాములుకు పంపాల్సిన ఆహారాన్నిమాత్రమే వండుతారు.
మొదటగా టెస్టింగ్...
వండిన తరువాత వెంటనే వాటిని అంతరిక్ష కేంద్రానికి పార్శిల్ పంపేయరూ. ముందుగా వాటిని ఇద్దరు ముగ్గురు చేత తినిపించి టెస్ట్ చేస్తారు. అది కూడా జీరో గ్రావిటీ ఛాంబర్లో. వారిలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ఆహారాన్ని నిలిపివేస్తారు.
ఎలా ప్యాక్ చేస్తారు...
రీహైడ్రేటబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ పద్దతిని అనుసరించి వ్యోమగాముల ఫుడ్ ను ప్యాక్ చేసి పంపిస్తారు.ఇందుకు రీహైడ్రేటబుల్ కంటైనర్లు వాడతారు. వీటిలో ఆకలి పుట్టించే పదార్థాలను పెట్టి పంపిస్తారు.ఈ కంటైనర్లలో పదార్థాలు పాడవకుండా ఎక్కువ కాలం ఉంటాయి.
ఎలాంటి ఆహారం పంపిస్తారు?
జీరో గ్రావిటీ ప్రాంతంలో నాలుకపై ఉన్న రుచిగ్రంథుల పనితీరు మారిపోతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వారికి ఆహారం తయారుచేస్తారు. అధికంగా చికెన్, పుట్టగొడుగుల సూప్‌లు, మాక్రోనీ, చీజ్, పోర్క్, రొయ్యల వంటకాలు, గుడ్లు, తృణధాన్యాలతో వండిన వంటలు, బంగాళాదుంపల వంటకాలు పంపిస్తారు. నాన్ ఫ్యాట్ పొడి పాలు కూడా పంపిస్తారు. వ్యోమగాములు రోజుకు నాలుగు సార్లు తింటారు. అల్పాహారం రెండు సార్లు తింటారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. రోజుకు 3,200 కేలరీల ఆహారాన్ని తీసుకుంటేనే వారి శరీర ఆర్గానిజమ్ చక్కగా పనిచేస్తుంది. అల్పాహారంలో దాదాపు బంగాళాదుంప, గొధుమరొట్టెలు, కాఫీ, పోర్క్ వంటకాలు ఉంటాయి. ఇక మధ్యాహ్న భోజనంలో మెత్తగా పేస్టులా మార్చిన చేపలు, రసంలాంటిది, బీఫ్, ద్రాక్షలు, రొట్టెలు ఉంటాయి. నీరు కూడా తీసుకెళతారు. ఒకవేళ నీరు అయిపోతే మూత్రము, చెమట, అక్కడి తేమను శుద్ధి చేసిన నీటిగా మార్చుకుని వాడతారు. అంతేకాదు పంపే ఆహారంలో తడి లేకుండా చూస్తారు. అన్నింట్లో తేమను తీసి ఘనీభవించేలా చేస్తారు. అంతరిక్ష కేంద్రంలో ఆ ఆహారంలో కాస్త వేడి నీరు పోస్తే చాలు మెత్తగా మారిపోతుంది. దాదాపు అన్నీ ఆహారాలు ఇలాగే ఉంటాయి. ఆహారం తయారయ్యాక దాన్ని ఫ్లోరిడా లేదా రష్యాకు పంపిస్తారు. ఆ రెండూ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి ఆహారాన్ని అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు.
ఇవి నిషేధం...
అంతరిక్ష కేంద్రానికి పంపే ఆహారంలో ఉప్పు, చక్కెర వంటి వాటిని విడిగా పంపించరు. ఆహారంలో కలిపేసే ఉంటాయివి. భారరహిత స్థితిలో ఉప్పు, చక్కెర వంటివి తేలుతూ వ్యోమగాముల ముక్కు, కళ్లలో పడే ప్రమాదముంది. అలాగే అక్కడున్న పరికరాల్లో కూడా చేరచ్చు. కుకీస్, సోడా, ఆల్కహాల్ వంటివి కూడా పంపించారు. అంతరిక్ష కేంద్రంలో ఆల్కహాల్ వినియోగంపై నాసా నిషేధం విధించింది. అది వ్యోమగాములు ఏకాగ్రతను దెబ్బతీస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. సోడాలో కార్బోనేషన్ అంతరిక్షంలో భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కార్భన్ డైయాక్షైడ్ అక్కడ బుడగల రూపంలో మారిపోవచ్చు.
Also read: తలనొప్పి, మైగ్రైన్‌తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు తగ్గిస్తాయి
Also read: వీటిని రోజూ తింటే మీలో జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది