winter weight: చలికాలంలో మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతాం... ఎందుకు? ఇలా చేస్తే సరి...
వేసవితో పోలిస్తే చలికాలంలో బరువు పెరగడం సహజం.
చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. కొంతమంది ఆ విషయాన్ని గుర్తిస్తారు, కానీ కొంతమంది గుర్తించలేరు కూడా. ఇప్పుడు ఇది చదివాక మాత్రం ఓసారి బరువును చెక్ చేసుకుంటారేమో. నిజానికి ఇది చాలా సాధారణ విషయం. వేసవి కాలంలో పోలిస్తే శీతాకాలంలో మనకు తెలియకుండా శరీరబరువు పెరుగుతుంది. ఆహారం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం వరకు చాలా కారణాల వల్ల బరువు పెరుగుతాం. ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ, ఉదయాన్నే లేవడం తగ్గుతుంది. ఎక్కువసేపు వెచ్చని దుప్పట్లోనే చుట్టుకుని ఉండిపోతాం. చలి వాతావరణం వల్ల రోజూ చేసే వ్యాయామాలు కూడా వాయిదాపడతాయి. శారీరకశ్రమ కూడా చాలా తగ్గిపోతుంది. దీనివల్లే తెలియకుండానే రెండు మూడు కిలోలు పెరిగేస్తాం.
ఆహారం కూడా కారణమే..
చల్లని వాతావరణంలో వేడివేడి ఆహారాన్ని అధికంగా లాగించేస్తాం. రెండు మూడు గంటలకోసారి ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది. ఇక కాఫీ, టీలకైతే బ్రేక్‌లే ఉండవు. అంతేకాదు వేసవితో పోలిస్తే చలికాలంలో ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. అధిక కేలరీలుండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. వేపుళ్లు కూడా అధికంగా లాగిస్తాం. దీని వల్ల సాధారణంగానే శరీర బరువుపై ప్రభావం కనిపిస్తుంది. బరువు పెరిగాక బాధపడే కన్నా ఇప్పుడే నియంత్రణలో పెట్టుకుంటే మంచిది కదా...
ఇలా చేయండి..
ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకండి, పండ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. అంతేకాదు ఆఫీసుల్లో సీట్లకు అతుక్కుని కూర్చోకుండా కనీసం ఓ అరగంట పాటూ ఆఫీసు టెర్రస్ పైనో, కారిడార్లోనే వాకింగ్ చేసేందుకు ప్రయత్నించండి. నిద్ర సమయాన్ని కూడా తగ్గించండి. చల్లగా ఉంది కదా అని అలాగే బెడ్ ను అతుక్కోవద్దు. చలి దుస్తులు వేసుకునైనా ఉదయం లేదా సాయంత్రం కచ్చితంగా వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చలి కూడా తగ్గుతుంది. టీలు, కాఫీలు తాగడం తగ్గించండి. ఆహారం పొట్ట నిండా తినకుండా, మీరే తినే దానిలో సగమే తినండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల శీతాకాలంలో బరువు పెరిగే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.
Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి