Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి
డయాబెటిస్‌ను వాయిదా వెయ్యడం లేదా నివారించడం సాధ్యమే అని రకరకాల పరిశోధనలు ఇప్పటికే నిరూపించాయి. చిన్న పాటి జీవన శైలి మార్పులతో ఇది సాధ్యపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారు. ఒకప్పుడు మధ్య వయస్సు నుంచి ఈ వ్యాధి ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడు మారిన ఆహారం, జీవనశైలి, పని సమయాలు వంటి అనేక కారణాలతో టైప్2 డయాబెటిస్ చాలా చిన్న వయసులోనే వచ్చేస్తోంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం, ఆహారంలో కార్బోహైడ్రేట్లు తగ్గించి తీసుకోవడం, చక్కెరలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం, వేపుళ్ల వంటి జీరో న్యూట్రియెంట్లు కలిగిన ఆహారం తీసుకోక పోవడం వంటి కొన్ని జాగ్రత్తలతో డయాబెటిస్‌ను అదుపులో పెట్టడం సాధ్య పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ అదుపులో పెట్టుకునేందుకు తప్పనిసరిగా వాకింగ్ చెయ్యాలని సూచిస్తారు. అయితే నడక వేగం కూడా డయాబెటిస్ అదుపు చెయ్యడంలో కీలకంగా పనిచేస్తుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
గంటకు మూడు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో నడిచే వారి కంటే గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిచే వారికి డయబెటిస్ వచ్చే ప్రమాదం 39 శాతం తక్కువగా ఉంటుందని ఇరాన్ పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతి 1Kph (గంటలకు ఒక కిలోమీటర్) వేగంతో నడిస్తే డయాబెటిస్ పెరుగుదల ప్రమాదం 9 శాతం వరకు తగ్గుతుందట. సెమ్నాన్ యూనివర్సిటి మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో డయాబెటిస్ బాధితులు లేదా షుగర్ వస్తుందనే భయపడేవారు.. నిత్యం వాకింగ్ సమయాన్ని పెంచడం మాత్రమే కాదు.. నడక వేగం పెంచడం కూడా అవసరమే అని సూచిస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్సించాలని అంటున్నారు.
నడకవేగం కూడా డయాబెటిస్‌ను నియంత్రించడంలో, నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని బ్రిటీస్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం వెల్లడించింది.
పరిశోధకులు 1999 నుంచి 2022 మధ్య ప్రచురితమైన దాదాపు 10 అధ్యయనాలను పరిశీలించినట్టు వెల్లడి చేశారు. ఈ పరిశోధన కోసం యూకే, యూస్, జపాన్ కు చెందిన మొత్తం 508, 121 మంది డయాబెటిక్ రోగులను ఎంపిక చేసుకున్నారు. 3-5 kph వేగంతో నడిచే వారిలో డయాబెటిస్ ప్రమాదం 15 శాతం తక్కువగా ఉన్నట్టు గమనించారని నిపుణులు వెల్లడి చేస్తున్నారు. మరింత వేగంతో నడిచే వారిలో 24 శాతం వరకు డయాబెటిస్ ప్రమాదం తగ్గినట్టు ఈ అధ్యయన వివరాలు చెబుతున్నాయి.
అదుపులో లేని డయాబెటిస్ వల్ల శరీరంలోని అన్ని ముఖ్యమైన అవయవాల మీద చెడు ప్రభావం పడుతుంది. దీన్ని అదుపు చెయ్యడం కోసం వేగంగా నడిస్తే మంచి ఫలితం ఉంటుందని కొత్త అధ్యయనం సారాంశం.
Also Read :Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది