Kids Breakfast: పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ఇలా పాన్ కేక్ చేసి పెట్టండి
వెజిటబుల్ పాన్ కేక్ తయారీ చాలా సులువు. ఇది ఎన్నో ఆరోగ్య పోషకాలను అందిస్తుంది.
పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ తయారు చేసి రోజూ బాక్సులు పెట్టి ఇవ్వాల్సిందే. ఎప్పుడూ ఒకేలాంటి ఆహారం పెడితే వారికి బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు కొత్తగా చేసి పెట్టాలి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో తినే వెజిటబుల్ పాన్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని చేయడం కూడా చాలా సులువు. దీన్ని తినడం వల్ల అనేక కూరగాయలు శరీరంలోకి చేరుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
నీళ్లు - అరకప్పు
క్యాప్సికం - ఒకటి
కొత్తిమీర - ఒక కట్ట
పెరుగు - అరకప్పు
క్యారెట్ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
నల్ల మిరియాల పొడి - అర స్పూను
ఆయిల్ - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర వంటి కూరగాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్మా రవ్వని వేయండి. దానిలో పెరుగు, నీళ్లు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, నల్ల మిరియాల పొడి కూడా వేసి కలపండి. పిండి సిద్ధమవుతుంది. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయల తరుగును ఇందులో వేసి బాగా కలపండి. పావుగంట సేపు పక్కన పెట్టండి. అవసరం అయితే మరి కొంచెం నీరు కలపండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. ఊతప్పం వేసినట్టు ఈ పిండిని కాస్త లావుగా అట్టులా వేయండి. బంగారు గోధుమరంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చండి. దీన్ని పిల్లలకు పుదీనా చట్నీతో లేదా టమోటో కెచప్ తో తినిపించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనిలో వాడేవి అన్ని కూరగాయలే, ఆరోగ్యానికి మేలు చేసేవి. కాబట్టి పిల్లలకు బలాన్ని అందిస్తుంది.
ఉప్మా రవ్వను గోధుమలతో తయరుచేస్తారు. కాబట్టి దీన్ని తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు. గోధుమ రవ్వలో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటివి ఉంటాయి. అలాగే శరీరంలో నరాల వ్యవస్థకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది.ఇందులో క్యాప్సికం కూడా వేశాము. దీన్ని తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. విటమిన్ సి దీనిలో అధికంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి ఇది మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సహజమైన మెరుపును అందిస్తాయి. ఇందులో వాడే ఉల్లిపాయలో యాంటి బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. నిద్రలేమి వంటి నిద్రా సమస్యలను ఉల్లిపాయ అడ్డుకుంటుంది.
Also read: పెళ్లయ్యాక కూడా అతనే గుర్తుకొస్తున్నాడు, తప్పని తెలిసినా తప్పించుకోలేకపోతున్నా
Also read: మెరుస్తున్న పుట్టగొడుగులను చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే, మన దేశంలోనే ఉంది ఈ ప్రదేశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.