Age Reverse Method: గుడ్ న్యూస్, చర్మ కణాల రీప్రోగామింగ్‌తో వృద్ధాప్యానికి వీడ్కోలు, వయస్సు 30 ఏళ్లు వెనక్కి!
‘హే బేబీ’ సినిమాలో సమంతలా కొన్నేళ్లు వెనక్కి వెళ్లిపోవాలని ఉందా? అయితే, ఆ రోజులు మరెంతో దూరంలో లేవు.
వృద్ధాప్యం మీదపడగానే మనసులో ఏదో బెంగ. ఎలా ఉండేవాళ్లం.. ఎలా అయిపోయామంటూ అద్దంలో చూసుకుని తెగ ఫీలైపోతుంటారు. అలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చర్మ కణాలను రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వయస్సును 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మానవ చర్మంలో వయస్సు మీదపడిన కణాల పనితీరును పాక్షికంగా పునరుద్ధరించడం ద్వారా వయస్సును రివర్స్ చేయొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
చర్మ గాయాలను నయం చేసే విధానాలపై జరిగిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పాక్షికంగా పునరుజ్జీవింపబడిన కణాలు యవ్వన కణాల్లా చురుగ్గా ప్రవర్తించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో కొన్ని ఔషదాల ద్వారా యవ్వనాన్ని తిరిగి పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఆల్టోస్ ల్యాబ్స్ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ లీడర్ ప్రొఫెసర్ వోల్ఫ్ రీక్ దీని గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ కణాలను మేము పునరుత్పత్తి చేయలేదు. దానికి బదులుగా పునరుజ్జీవింపజేసే జన్యువులను గుర్తించగలిగాం. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడానికి ప్రత్యేకంగా వాటిని లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ విధానంతో త్వరలో అద్భుతాన్ని ఆవిష్కరించవచ్చు’’ అని తెలిపారు.
Also Read: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త డాక్టర్ దిల్జీత్ గిల్ మాట్లాడుతూ.. “సెల్ రిప్రొగ్రామింగ్ ద్వారా కణాల పనితీరుకు నష్టం లేకుండా పునరుజ్జీవింపజేయవచ్చని మేం నిరూపించగలిగాం. ఈ పునరుజ్జీవన విధానం పాత కణాల్లో కొంత పనితీరును పునరుద్ధరించేలా చూస్తుంది. ఈ కొత్త పద్ధతి.. మూలకణాలను తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను ఇటీల eLife జర్నల్‌లో ప్రచురించారు. చూశారుగా.. ఇకపై మీరు వయస్సు పెరుగుతుందనే ఆందోళన పెట్టుకో అక్కర్లేదు. మీ వయస్సు ఎంత పెరిగినా.. యవ్వన చర్మంతో తిరిగి ‘హే బేబీ’లా మారిపోవచ్చు.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి