AC Power Saving Tips: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
వేసవిలో AC వాడాలంటేనే భయపడిపోతున్నారా? విద్యుత్తు బిల్లులు మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? అయితే, ఇలా చేస్తే.. ఎలాంటి చింత లేకుండా ఏసీ వాడుకోవచ్చు.
AC Maintenance Tips | ఒక పక్కన ఎండ, మరో పక్కన పెరిగిన విద్యుత్ ఛార్జీలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఎండ వేడిని భరించలేక ఏసీ ఆన్ చేయాలంటే.. ఎన్నో ఆలోచనలు.. ‘‘ఇప్పుడైతే ఏసీ వాడేస్తాం. కరెంటు బిల్లు వాచిపోతుంది’’ అని అనుకుంటారు. పవర్ ఛార్జీలు తక్కువగా ఉన్నప్పుడు ఏసీ వినియోగదారులకు బిల్లులు పేలిపోయేవి. ఇప్పుడు అది రెండింతలు కానుంది. అయితే, దీని గురించి మీరు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. సింపుల్‌గా ఈ టిప్స్ పాటిస్తే చాలు.. మీ ఏసీ తక్కువ విద్యుత్తును ఖర్చు చేసి మీ జేబుకు చిల్లుపడకుండా చేస్తుంది.
AC బాగానే పనిచేస్తుంది కదా అని చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఏసీని తప్పకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. వేసవి సమీపించగానే మెయింటెనెన్స్ చేయించాలి. కండీషన్‌లో ఉండే AC యూనిట్ తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తుంది. గదిని త్వరగా చల్లబరుస్తుంది. అంతేగాక ఏసీ యూనిట్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. బ్రేక్‌డౌన్‌లకు అవకాశమే ఉండదు. AC తక్కువ శక్తిని వినియోగించడం వల్ల విద్యుత్ బిల్లులపై డబ్బు ఆదా అవుతుంది.
మీ ఇంట్లో ఏసీని మీరే తనిఖీ చేయవచ్చు. కానీ, కొన్ని పనులకు మాత్రం లైసెన్స్ కలిగిన శిక్షణ పొందిన నిపుణులు ఉండాలి. ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయొచ్చు. నిర్వహణ(maintenance) పనులు చేసే ముందు ఏసీ యూనిట్ నుంచి పవర్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి.
❄ ఏసీ ఇలా పనిచేస్తుంది: స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌లు అవుట్‌డోర్, ఇండోర్ యూనిట్‌తో అమర్చి ఉంటాయి. అవుట్‌డోర్ యూనిట్‌లో కంప్రెసర్ లేదా కండెన్సర్ ఉంటుంది. ఇండోర్ యూనిట్‌లో ఆవిరిపోరేటర్ ఉంటుంది. కాబట్టి, మీరు మీ AC అవుట్‌డోర్, ఇండోర్ యూనిట్‌లను శుభ్రం చేయడానికి మృదువైన బ్రిస్టల్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు. మీరు రెగ్యులర్‌గా ఏసీని ఉపయోగిస్తుంటే తప్పకుండా నెలకు ఒకసారి తనిఖీ చేయాలి. బయట యూనిట్‌ను క్లీన్ చేసేప్పుడు కాయిల్ రెక్కలు వంగకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అలాగే, ఏసీ వేసినప్పుడు దాని నుంచి గట్టిగా శబ్దం వస్తున్నట్లయితే టెక్నీషియన్‌కు కాల్ చేయండి. ఎక్కువ రోజుల నుంచి ఏసీని వాడట్లేనట్లయితే కంప్రెసర్ కాయిల్‌లో ఆయిల్ వేయాల్సి ఉంటుంది.
❄ సరైన డిఫాల్ట్ ఉష్ణోగ్రతను సెట్ చేయండి: ఏసీ తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేయాలంటే నిర్దిష్ట ఉష్ణోగ్రతను పాటించాలి. జపాన్ వంటి దేశాల్లో ఏసీ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండవు. ఇండియాలో ఉపయోగించే ఏసీలు మాత్రం 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ఇటీవల AC తయారీ సంస్థలు తమ పరికరాల డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌కు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. ఇది వరకు ఆ లిమిట్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉష్ణోగ్రతను పెంచే ప్రతి డిగ్రీకి దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు మీ ACలో ఉష్ణోగ్రతలు ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ సేపు కంప్రెసర్ పనిచేస్తుంది. దాని వల్ల ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. కాబట్టి మీరు ACని గరిష్టంగా 24 డిగ్రీల వద్ద ఉంచండి.
❄ తలుపులు తెరవద్దు, గాలి చొరబడనివ్వద్దు: ఏసీ ఉండే గదిని ఎప్పుడూ మూసే ఉంచాలి. దాని వల్ల అప్పటివరకు ఏసీ వల్ల ఏర్పడిన చల్లదనం బయటకు పోకుండా ఉంటుంది. కిటికీలు, తలుపులు గట్టిగా మూసివేయాలి. సూర్యరశ్మి గదిలో పడకుండా కిటికీలకు కర్టెన్లు పెట్టండి. గదిలో ఎండపడినా, వేడి వస్తువులు ఉన్నా ఏసీపై లోడ్ పడుతుంది. ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. AC ఆన్ చేసే ముందు మీరు వాటిని ఆఫ్ చేయండి. లేదా ఏసీ ఉండే గదిలో అవి లేకుండా చూడండి. అల్మారాలు తెరిచి ఉండకూడదు. దాని వల్ల ఏసీలోని చల్లదనమంతా దుస్తులు లేదా వేరే వస్తువులు గ్రహిస్తాయి. దాని వల్ల ఏసీ ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తుంది.
❄ విద్యుత్తును ఆదా చేయడానికి స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేయండి: ఏసీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చలిగా ఉంటుంది. దీంతో మధ్యరాత్రిలో దాన్ని ఆపేసి నిద్రపోతారు. ఇది చాలా మంచి విధానం. అయితే, కొందరు ఎంత చల్లదనం ఉన్నా దుప్పటి కప్పుకుని నిద్రపోతారు. ఏసీని ఆపడానికి ఇష్టపడరు. దానివల్ల విద్యుత్తు ఎక్కువ ఖర్చవుతుంది. ఏసీ వల్ల గది అప్పటికే చల్లగా ఉంటుంది. కాబట్టి, రాత్రి వేళల్లో నిద్రలోకి జారుకోగానే ఏసీని ఆపేయొచ్చు. మరీ ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్ చేస్తే సరిపోతుంది. రెండు గంటల పాటు ఏసీ ఆన్ చేసి ఉంచి, మరో ఒకటి లేదా రెండు గంటల పాటు స్విచ్ ఆఫ్ చేయండి. దీనివల్ల గది తగినంత చల్లగా ఉంటుంది. చాలా విద్యుత్తు ఆదా అవుతుంది.
❄ ఏసీ ఆన్‌లో ఉంటే ఫ్యాన్ వాడొచ్చు: చాలామంది ఏసీ ఆన్‌లో ఉంటే ఫ్యాన్ వాడుతుంటారు. ఇది కూడా మంచిదే. ఫ్యాన్, ఏసీ.. రెండూ ఆన్‌లో ఉండటం వల్ల విద్యుత్ ఎక్కువ ఖర్చవుతుందని భావిస్తారు. కానీ, అలా జరగదు. AC నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ని స్విచ్ ఆన్‌లో ఉంచండి. దీని వల్ల ఫ్యాన్ గాలి ఏసీలోని చల్ల దానాన్ని రూమ్ మొత్తం వ్యాపించేలా చేస్తుంది. దానివల్ల మీరు ఏషీలోని ఉష్ణోగ్రతలను తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఏసీ నుంచి వచ్చే చల్లగాలిని ఫ్యాన్ మీ శరీరానికి తాకేలా చేయడం వల్ల మీకు ఉష్ణోగ్రతలు తగ్గించాల్సిన అవసరం రాదు.
❄ రెగ్యులర్ సర్వీసింగ్, క్లీనింగ్ విద్యుత్తును ఆదా చేస్తుంది: ACలో పేరుకుపోయే దూమ్మూ, ధూళి.. చల్లగాలిని గది మొత్తం విస్తరింపజేయడానికి ఆటంకం కలిగిస్తాయి. దాని వల్ల ఏసీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఫిల్టర్‌లను శుభ్రం చేయడం ద్వారా AC విద్యుత్ వినియోగాన్ని 5-15 శాతం తగ్గించవచ్చు. అలాగే, ఏసీ ఎక్కువ రోజులు సమర్దవంతంగా పనిచేస్తుంది. వేసవి ప్రారంభానికి ముందే మీరు ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేయాలి. ప్రవహించే గాలి మురికిగా మారితే, అది అలెర్జీ, ఆస్తమాలకు దారితీస్తుంది.
Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!
❄ ఎయిర్ కండీషనర్ కాయిల్‌ను శుభ్రం చేయాలి: ఏసీలో కేవలం ఫిల్టర్లను శుభ్రం చేస్తే సరిపోదు. కండెన్సర్ కాయిల్స్‌ను కూడా శుభ్రం చేయాలి. వాటిలో కూడా మురిగి పేరుకుపోతుంది. దాన్ని శుభ్రం చేయకపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. కాయిల్ మీద దుమ్ము అట్టలా పేరుకుపోతుంది. ఫలితంగా కాయిల్ వేడిని సరిగ్గా గ్రహించదు. కనీసం నెలకు ఒకసారి దానిని శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏసీ బయట యూనిట్‌లో కూడా దుమ్మూ, దూళి, ఆకులు పేరుకుపోతే వాటిని తొలగించి శుభ్రంగా ఉంచండి.
గమనిక: విద్యుత్ ఉపకరణాలను తనీఖీ చేసేప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి. అవి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. వీలైతే టెక్నీషియన్ ద్వారా ఏసీ సర్వీస్ చేయించుకోవడం ఉత్తమం. నెల నెలా కాకపోయినా, ఏడాదిలో రెండు సార్లు మెయింటెనెన్స్ అవసరం. కాబట్టి, ఆ పనులను టెక్నీషియన్స్‌తోనే చేయించండి.