Water On Meteorite: మహా సముద్రాలకు గ్రహశకలాలకు మధ్య సంబంధం ఉందా?
అంతరిక్ష పరిశోధనలో బ్రిటన్ శాస్త్రవేత్తలు అరుదైన అంశాన్ని గుర్తించారు. ఉల్కలో తొలిసారి భూగోళ జలాలను కనుగొన్నారు. 2021లో పడిన వించ్‌కాంబ్ ఉల్కకు సంబంధించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
గత ఏడాది ఫిబ్రవరిలో యూకే లోని గ్లౌసెస్టర్‌షైర్ పట్టణం మీద ఉల్కాపాతం జరిగింది. ఈ ఘటనా ప్రాంతంలో పరిశోధకులు వించ్ కాంబ్ అనే ఉల్కను కనుగొన్నారు. ఈ ఉల్క బరువు కేవలం 0.5 కిలోలు. దీనిపై గత ఏడాది కాలంగా పరిశోధకులు రకరకాల అధ్యయనాలు చేస్తున్నారు. తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఉల్కలో గతంలో ఏ ఉల్కలోనూ లేని అత్యంత అరుదైన విషయాలు ఉన్నాయని తెలిపారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ ఉల్కలో భూగోళ జలాలు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఉల్కలో భూగోళ జలాలు ఉండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు పరిశోధకులు.
నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని ఉల్క పరిశోధకుడు యాష్లే కింగ్ ఈ ఉల్కకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. ఈ ఉల్క శాంపిల్ 12 శాతం నీళ్లతో తయారైందని తెలిపారు. ఆ నీటి కూర్పు భూమి మీద ఉన్న మహాసముద్రాలలోని నీటి కూర్పును చాలా వరకు పోలి ఉందన్నారు. వించ్ కోంబ్ లాంటి గ్రహశకలాలకు, భూమి మీదున్న మహాసముద్రాలకు మధ్య ఏదో ముఖ్యమైన సహకారం ఉందనడానికి ఇదో మంచి ఉదాహరణగా ఆయన వెల్లడించారు. యూకేలో గ్రహాంతర జలాలతో కూడిన ఉల్క పడిపోవడం ఇదే తొలిసారి అని ఆయన ధృవీకరించారు.
భూమిపై కనుగొన్న ఇతర ఉల్కల మాదిరిగా వించ్ కోంబ్ చాలా పెద్దది కాదు. దీని బరువు 0.5 కిలోలు మాత్రమే. ఈ ఉల్క ఎలాంటి కలుషితానికి గురి కాకపోవడం మూలంగా భూమి మీదున్న నీరు.. దీనిలోకి ఎక్కడి నుంచి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ అంశంపై పరిశోధనలు కొనసాగించారు. తాజాగా యాష్లే కింగ్.. ది టెలిగ్రాఫ్ పత్రికకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించారు. గతంలో ఉల్కల మీద అనేక పరిశోధనలు జరిగాయని.. అందులో నీటి కూర్పు కనిపించలేదన్నారు. కానీ వించ్ కాంబ్ ఉల్కలోని నీటికూర్పు.. భూమ్మీదున్న సముద్ర జలాల కూర్పుకి చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. కాబట్టి, కార్బోనేషియస్ గ్రహ శకలాలు బహుశా భూమి మీద ఉన్న నీటికి ప్రధాన వనరుగా భావించవచ్చని కింగ్ వెల్లడించారు.
గ్లౌసెస్టర్‌షైర్ పట్టణంలో వించ్ కాంబ్ ఉల్క పడిన తర్వాత సుమారు 12 గంటలకు పరిశోధకులు సేకరించారు. ఉల్క తన సహజత్వాన్ని కోల్పోక ముందే ల్యాబ్ కు తరలించారు. ఉల్క తాజాగా ఉన్నప్పుడే పరిశోధనలు మొదలు పెట్టినట్లు కింగ్ వెల్లడించారు. గ్రహ శకలాలు, వించ్ కోంబ్ వంటి ఉల్కలు భూమి యొక్క మహా సముద్రాలకు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని నిరూపించడానికి ఇదో మంచి మంచి సాక్ష్యంగా మారవచ్చన్నారు. ఈ అంతరిక్ష శిల దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని విశ్వసించే పెద్ద కార్బోనేషియస్ గ్రహ శకలం నుంచి వచ్చి ఉండవచ్చన్నారు.