Marriage: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇద్దరి జీవితాలే కాదు, ఆ ఇద్దరికి చెందిన కుటుంబాలు కూడా ఇబ్బందులపాలవుతాయి.
పాతకాలంలో పెళ్లిళ్లు వేరు. తల్లిదండ్రుల చూసిన సంబంధానికే ఓకే చెప్పేవారు. కొందరైతే పెళ్లి పీటల మీదే జీవిత భాగస్వామిని చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రేమ పెళ్లిళ్లు పెరిగాయి. పెద్దలు చూసిన సంబంధాలైనా కూడా వెంటనే పెళ్లిళ్లు అయిపోవడం లేదు. కొన్నిరోజుల లేదా, నెలలు గ్యాప్ వస్తోంది. కాబోయే జంట కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసే అవకాశం లభిస్తోంది. ఆ ట్రావెల్ లో ఒకరినొకరు తెలుసుకునే అవకాశం దక్కుతోంది నేటి యువతకి. అయితే ఆ జర్నీలో మీరు ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశాన్ని వదులుకోవద్దు. వారి లక్షణాలను, మాటతీరును, అలవాట్లను అన్నింటినీ తెలుసుకోవాలి. తద్వారా వారిని పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాలి. కొన్ని లక్షణాలున్న వ్యక్తులను వివాహం చేసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.
1. అబద్ధాలకోరు
అతను లేదా ఆమె మీతో ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేవాళ్లు ఉంటారు. వారికి తమ విషయాలను చెప్పడం ఇష్టం ఉండకే అబద్ధంతో కప్పిపుచ్చుతారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా రహస్యాలను దాచేందుకు ఇష్టపడతారు. చాలా చిన్న అబద్ధాలే కదా అని చాలా సార్లు మీరు పట్టించుకోకపోవచ్చు... కానీ అవే భవిష్యత్తులో పెద్దవి కూడా కావచ్చు. ఇలాంటి వారి విషయంలో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.
2. హిపోక్రైట్స్
వీళ్లు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మాటలు వింటే చాలా స్పూర్తివంతంగా అనిపిస్తాయి, కానీ వారు చేసే పనులు మాత్రం చికాకు కలిగిస్తాయి. అంతేకాదు తాము చేసిన పనిని సమర్థించుకుని, అదే పని ఎదుటి వారు చేసినప్పుడు మాత్రం తప్పులు ఎంచుతారు. ఇలాంటి కపటవాదులకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులుగా ఉన్నంతవరకు ఫర్వాలేదు, కానీ జీవితభాగస్వామికి ఈ లక్షణం మంచిది కాదు.
3. మూలిగే మనిషి వద్దు
కొంతమంది నిత్యం ఏదో బాధపడుతున్నట్టు మూలుగుతూనే ఉంటారు. బాధితులమని చెప్పుకుంటూ ‘విక్టిమ్ కార్డు’ వాడుతుంటారు. తాము చేసిన తప్పులు కూడా వేరొకరి మీద పెట్టి బాధపడిపోతుంటారు. వీరితో సహవాసం చాలా కష్టం.
4. నేను, నాది, నాకే సొంతం...
వీరు స్వార్థపరులు. నోరు విప్పి ఏది మాట్లాడినా ‘నేను, నాకు’ అన్న పదమే ఎక్కువ వినిపిస్తుంది. తమ గురించే ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు వీళ్లు. ప్రపంచంలో తామే కేంద్రబిందువులుగా ఫీలవుతుంటారు. అందరూ తమకే ప్రాధాన్యనివ్వాలని కోరుకుంటారు. ఇలాంటి వాళ్లతో వేగడం చాలా కష్టం.
5. అస్పష్టత
వీరు చెడ్డవాళ్లు కాదు, ఇలాంటి వాళ్లని పెళ్లి చేసుకుంటే కష్టాలు పడతారని చెప్పలేం, కానీ చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. కారణం వీరికి నిర్ణయం తీసుకునే శక్తి తక్కువ. చాలా విషయాల్లో అస్పష్టంగా ఉంటారు. ఏదీ తేల్చుకోరు, ఎదుటివారిని తేల్చుకోనివ్వరు. వారు గీసుకున్న గుండ్రంటి సర్కిల్ లోనే తిరుగుతూ ఉంటారు. అది దాటి బయటికి వచ్చేందుకు భయపడుతుంటారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు