Angry: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
కోపం అందరికి కలిగే ఫీలింగే. కానీ కొందరిలో మాత్రం అది అతిగా ఉంటుంది. దానికి కారణాలేంటో కచ్చితంగా తెలుసుకోవాలి.
సంతోషం, బాధ లాగే కోపం కూడా ఒక భావోద్వేగం. అది సందర్భానుసారం పుట్టుకొస్తుంది. అయితే అది కాసేపే ఉండి మళ్లీ మాయమవుతుంది. మనిషిలో కోపం రావడం, పోవడం సహజం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు.. ఇలా రకరకాల కారణాలు కోపం వెనుక ఉండొచ్చు. కానీ కొందరిలో మాత్రం కోపం తరచూ కనిపిస్తుంది. గంటగంటకి కోప్పడుతూనే ఉంటారు. చిన్న శబ్ధానికే చిరాకు పడతారు, చిన్న మాటకే కసురుకుంటారు, అరుస్తారు, గొడవపడతారు. ఇలాంటి కోపానికి కొన్ని రుగ్మతలు కూడా కారణం కావచ్చు. అవేంటో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
డిప్రెషన్
తీవ్రమైన మానసిక వ్యధ వల్ల కొంతమంది డిప్రెషన్ బారిన పడతారు. దీని వల్ల తెలియకుండానే కోపం, నిరాశ పెరిగిపోతుంది. చిన్నచిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తారు. కోప్పడతారు.
మూర్ఛ
పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం మూర్ఛ వ్యాధిగ్రస్తులు కూడా అధికంగా భావోద్వేగాలకు గురవుతారు. ఇది కోపం, దూకుడుగా ఉండే భావాలను కలిగించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.
ఓసీడీ
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ను చిన్నగా ఓసీడీ అని పిలుచుకుంటాం. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. చెప్పిన టైమ్ కే పనులు చేయాలనే మనస్తత్వం, అతి శుభ్రత వీరి లక్షణాలు. వీరి అబ్బెసివ్ ఆలోచనల వల్ల అనుకున్న సమయానికి పనులు అవ్వకపోయినా, తన చుట్టుపక్కల శుభ్రంగా లేకపోయినా చిరాకు, కోపం ఎక్కువవుతుంది. కారణం లేకుండా కోపోద్రిక్తులవుతుంటారు.
బైపోలార్ డిజార్డర్
ఇది తీవ్రమైన మానసిక స్థితి. కచ్చితంగా చికిత్స అవసరమైన మానసిక ఆరోగ్య సమస్య. వీరి మూడ్ అతి త్వరగా మారిపోతుంది. అప్పటివరకు కూల్ గా ఉండే ఈ వ్యక్తులు హఠాత్తుగా కోపంతో అరుస్తారు.
ఆల్కహాల్, డ్రగ్స్ వాడకం
అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్లకి, మాదక ద్రవ్యాలను వాడే వారికి కోపం త్వరగా వస్తుంది. సమయం, సందర్భం లేకుండా చిన్న చిన్న విషయాలకే కోప్పడుతుంటారు. ఇలాంటి చెడు అలవాట్ల వల్ల స్పష్టంగా, హేతుబద్ధంగా ఆలోచించే సామర్ధ్యాన్ని కోల్పోతారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం
Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?
Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే