World Food day: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
బాగా బతకడమంటే బంగ్లాలు, కార్లు కొనుక్కోవడం కాదు, పొట్ట నిండా పోషకాహారం తినడం. కానీ ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది?
కోటి విద్యలు కూటి కొరకే, తిండి కలిగితే కండ కలదోయ్... కండ కలవాడేను మనిషోయ్ ఇలాంటి కవితలు అప్పుడెప్పుడో పుట్టాయ్... వీటి సారాంశం అన్నింటికన్నా ముఖ్యమైనది ఆహారం అని. మనిషి కనీస అవసరాలలో ప్రధానమైనది ఆహారమే. అది లేకుండా ఒక రోజు కూడా ఆనందంగా జీవించలేరు. మనిషే కాదు ఆహారం లేకుండా సృష్టిలోని ఏ ప్రాణి మాత్రం జీవించగలదు? అయితే చాలా మంది సంపాదన మాయలో పడి కడుపు నిండా ఆహారం కూడా తినడం లేదు. నిత్యం గంటలుగంటలు పని చేస్తూ, లక్షల జీతాలు అందుకుంటూ ఏదో ఒక బర్గర్ లేదా పిజ్జాతో కడుపునింపేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇంకోవైపు తినేందుకు ఆహారం లేక పస్తులతో గడుపుతున్న జనాలు కోట్లలో ఉన్నారు. పోషకాహారలోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రతి ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐరాస. దీని ఉద్దేశం ఆహారం విలువను తెలియజేయడమే.
ఎప్పుడు మొదలైంది?
దేశంతో, ప్రాంతంలో సంబంధం లేకుండా భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికీ పోషకాహార లభించాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి 1945, అక్టోబర్ 16న ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ను ప్రారంభించింది. ఆ సంస్థ ఆహారం విషయంలో ప్రజల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో 1979లో అక్టోబర్ 16ను ‘ఆహార దినోత్సవం’గా ప్రకటించింది. 1981 నుంచి చాలా దేశాలు ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి. ప్రస్తుతంవ 150 దేశాల్లో ఈ ప్రత్యేక రోజును నిర్వహిస్తున్నారు.
ఎంత తినాలి?
భారత పోషకాహార సంస్థ చెప్పిన ప్రకారం, భారతీయులు రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కానీ ఎంత మంది తింటున్నారన్నది ప్రశ్నార్థకమే. తినే ఆహారంలో కొవ్వులు, చక్కెర, ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
భూమ్మీద మనిషి తినగలిగే మొక్క జాతులు దాదాపు 30 వేలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ మనం వాటిలో కేవలం 10 నుంచి 12 మాత్రమే తింటున్నాం. బార్లీ, బీన్స్, వేరుశెనగ, మొక్కజొన్న, వరి, జొన్నలు, గోధుమలు వంటివి రోజూ వారీ ఆహారంలో భాగంగా మార్చుకోవాలి.
ఆహారాన్ని వేస్టు చేయద్దు
ప్రపంచంలో ఆహార వృథా అధికస్థాయిలో ఉంది. మనదేశంలో ఏటా 6.8కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్టు గుర్తించారు. ఇది యూకేలోని జనాభా మొత్తానికి సరిపోయేంత పరిమాణం. దీని విలువ పద్నాలుగు వందల కోట్ల డాలర్లకు సమానం. అలాగని మనదేశంలో ఆకలి కేకలు లేవనుకోకండి. కేవలం ధనవంతులు ఇళ్లల్లో, పెళ్లిళ్లలో, హోటళ్లలో ఇలా ఆహారం వేస్టవుతోంది. 107 దేశాల ఆకలి సూచీ జాబితాలో భారత్ 94 వ స్థానంలో ఉంది. 12 పేద దేశాల్లోని నాలుగుకోట్ల మంది ప్రజలు ఆహారం లేక ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. అందుకే ఆహారాన్ని వేస్టు చేయకుండా పొదుపుగా వాడుకోవల్సిన అవసరం ఉంది.
Also read: మహనీయుల్లో కనిపించే లక్షణాలు ఇవన్నీ... నేర్చుకుంటే మీరూ గొప్పవారే
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Also read: బాదం పలుకులను నీటిలో నానబెట్టి తింటేనే ఎక్కువ లాభాలా? పచ్చిగా తినాలా?
Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే