Samantha: సమంత హెల్త్ టిప్ ప్రాణాలు తీస్తుందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత డేంజరా.. నిపుణులు ఏమంటున్నారు?
Samantha Health Tips: సమంత చెప్పింది చేస్తే ప్రాణాలు పోతాయట. ఇంతకీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏమిటీ? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అది శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది? తదితర వివరాలు మీ కోసం.
డాక్టర్లు యాక్టర్స్ కావచ్చేమో. కానీ, యాక్టర్స్ డాక్టర్స్‌గా మారితే ఇలాగే ఉంటుంది. నటి సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు చిక్కుల్లో పడటానికి కారణం ఇదే. సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అందుకే, ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు.. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఈ మధ్య పాడ్‌కాస్ట్ ద్వారా తనకు ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటికి పరిష్కారం తదితర అంశాలపై మాట్లాడుతోంది.
అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇటీవల ఆమె వైరల్ ఇన్ఫెక్షన్లను ఏ విధంగా నయం చేసుకోవచ్చో చెబుతూ ఓ హెల్త్ టిప్ చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. అందులో ఆమె సాధారణ ఔషదాలకు బదులుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ (hydrogen peroxide), డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంలో కలుపుకుని నెబ్యులైజర్ (Nebuliser - ముక్కుతో ఆవిరిని పీల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు) ద్వారా పీల్చితే.. ఇన్ఫెక్షన్లన్నీ మాయమవుతాయని సలహా ఇచ్చింది. ట్యాబ్లెట్స్‌తో పనిలేదని చెప్పింది. అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. ఆ టిప్ వల్ల సమంత.. డాక్టర్ల ఆగ్రహానికి గురైంది. ఈ సలహ తన ఫ్రెండ్ డాక్టర్ మిత్ర బసు చిల్లర్ ఇచ్చిందని స్పష్టం చేసినా సరే లాభం లేకపోయింది.
సమంత పోస్ట్‌పై స్పందించిన లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్.. అలా చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఆమెను జైల్లో పెట్టాలని మండిపడ్డారు. ఆరోగ్యానికి హాని కలిగించే సలహా ఇచ్చినందుకు జరిమానా విధించాలన్నారు. ఈ నేపథ్యంలో సమంత చెప్పిన సలహా అంత ప్రమాదకరమైనదా? అలా చేస్తే అసలు ఏం జరుగుతుందనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘ఏబీపీ దేశం’ దీనిపై రీసెర్చ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.
అలర్జీ ఫౌండేషన్ ఏం చెప్పిందంటే?
హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో నెబ్యులైజ్ చేయడం చాలా ప్రమాదకరమని ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. ది ఆస్తమా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఇప్పటికే దీనిపై కొన్ని సూచనలు చేసింది. హైడ్రోజన్ పెరాక్సైన్ శరీరంలోకి చేరడం వల్ల కణజాలం దెబ్బతింటోందని పేర్కొంది. దీన్ని తినడం లేదా పీల్చడం చాలా ప్రమాదకరమని, అలాగే చర్మం లేదా కళ్లకు తగిలినా ముప్పేనని వెల్లడించింది. ఊపిరితీత్తులకు ఏ మాత్రం మంచిది కాదని పేర్కొంది.
క్లీనింగ్ పనులకు ఉపయోగించే రసాయనం ఇది
Samantha misleading people based on some fallacious claims to breathe in nebulised hydrogen peroxide is like Trump urging people to drink bleach to fight Covid.
— French Toast 🍅 (@artistryinveins) July 5, 2024
Hydrogen peroxide an antiseptic which, if inhaled can damage your lung tissue.
Instagram influencers really need to… pic.twitter.com/Gz5SfntXPJ
సాధారణంగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను క్లీనర్‌గా ఉపయోగిస్తారు. ఔనండి, మీరు చదివింది కరక్టే. హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2)ను అద్దాలు, ఫ్లోర్ క్లీన్ చేయడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే వంటింట్లో క్రిములు చేరకుండా వాడతారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదు. కానీ, అది మన శరీరంలోకి వెళ్తేనే.. లేనిపోని సమస్యలు వస్తాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను హెయిర్ బ్లీచింగ్, పర్మినెంట్ హెయిర్ డైస్‌లో ఆక్సిడేషన్ కోసం కూడా ఉపయోగిస్తారు. అంతేకాదండోయ్.. మౌత్ వాష్‌లు, టూత్ బ్లీచింగ్ ప్రొడక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు.
అంతకంటే.. ఎక్కువ తీసుకుంటే ప్రాణాలు పోతాయ్
ఒక వేళ మీరు దాన్ని నేబ్యులైజర్ ద్వారా పీల్చాలి అనుకుంటే.. చాలా తక్కువ మొత్తంలో వాడాలి. కానీ, సొంత ప్రయత్నాలు వద్దు. తప్పకుండా ఇది వైద్యుల సమక్షణంలోనే జరగాలి. నెబ్యులైజర్‌లో డాక్టర్ సూచించిన ఆస్తమా ఔషధాన్ని మాత్రమే ఉపయోగించాలి. కాదంటే.. కష్టాలు తప్పవు. ఎందుకంటే.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను 10 శాతం కంటే ఎక్కువ తీసుకుంటే.. చర్మం, కళ్లను తినేస్తుంది. గొంతు, శ్వాసనాళ్లలో ఉండే సున్నితమైన భాగాలను సైతం పుండులా మార్చేయగలదు. బాగా ఇరిటేట్ చేస్తుంది. దాని వల్ల వికారం, వాంతులు అవుతాయి. శ్వాసకోస సమస్యలు ఏర్పడటమే కాదు.. ఊపిరితిత్తుల పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు. అదే జరిగితే ప్రాణాలు పోతాయ్. అందుకే, వైద్యులు.. సమంత విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇకనైనా యాక్టర్స్ చెప్పేవి వినడం మానేసి.. డాక్టర్స్ చెప్పేవి పాటించండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.