Nara Lokesh: లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో అరెస్టులు - రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది - లోకేష్ కీలక వ్యాఖ్యలు
liquor and sand scams: రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని నారా లోకేష్ అన్నారు. లిక్కర్, ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్టు అవుతారన్నారు. చంద్గరిగి కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలుచేశారు.
Nara Lokesh announced that there will be arrests soon in liquor and sand scams in AP: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ ఇంకా వైసీపీ హయాంలో జరిగిన స్కాములు, దారుణాలపై చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్యాడర్‌కు నారా లోకేశ్ సూటి సందేశం పంపించారు ఏపీలో త్వరలో లిక్కర్,ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్టు అవుతారని ప్రకటించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఆయన చెబుతున్నారు. సంక్రాంతి సంబరాల కోసం.. నారా వారి పల్లె వచ్చిన ఆయన చంద్రగిరి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ను పక్కన పెట్టలేదని.. దాని పని అది చేసుకుపోతుందన్నారు.
ఏపీలో గత ప్రభుత్వ హాయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సీఐడీని అదేశిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. సీఐడీ కేసులు నమోదు చేశారు. మైనింగ్ వ్యవహారంలో వెంకటరెడ్డి అనే అధికారిని అరెస్టు చేశారు కానీ ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇతర అరెస్టులు జరగలేదు. ఇందులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి సహా చాలా మంది ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక లిక్కర్ స్కామ్ ను అతి పెద్ద దోపిడీగా టీడీపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే లిక్కర్ పాలసీ మార్చి కేవలం జే బ్రాండ్స్ మాత్రమే అమ్మి వేల కోట్లు కాజేశారని ఆరోపిస్తున్నారు.
మరో వైపు పార్టీ క్యాడర్ కు నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని నారా లోకేష్ తెలిపారు.పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నామని దిగువ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. చంద్రగిరిలో నారా లోకేష్ ముఖ్య కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశమయ్యారు. రాక్ష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున చక్కదిద్దడంపై ఇప్పటి వరకూ ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పినట్లుగా తెలుస్తోంది.