Revanth Reddy : బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్.. గులాబీ పార్టీకి కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy :స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి పోరాటాలు చేయలేదన్నారు. అంతేకాకుండా వారు ఎటువంటి త్యాగాలు చేయలేదన్నారు. స్వాతంత్య్రం గురించి చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం మండిపడ్డారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కొత్త పేరు పెట్టారు. బీఆర్‌ఎస్ కాదని అది బీఆర్ఎస్ఎస్ అన్నారు. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఆరోపణలనే తెలంగాణలోనూ బీఆర్ఎస్ చేస్తోందంటూ రేవంత్ విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్‌తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు.
వాళ్లెవరు త్యాగాలు చేయలేదు
స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి పోరాటాలు చేయలేదన్నారు. అంతేకాకుండా వారు ఎటువంటి త్యాగాలు చేయలేదన్నారు. స్వాతంత్య్రం గురించి చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం మండిపడ్డారు. మోహన్ భాగవత్ అదే చెప్పారని స్వాతంత్య్ర పోరాటంలో వాళ్లు పాల్గొనలేదని.. వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ వివరించారు. స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేపట్టాలన్నారు. ఆ క్రమంలోనే మోహన్ భాగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read : KTR: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం
తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్ట
బీజేపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్ట అన్నారు. అందుకే తాము ఆ పార్టీని భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పీఎం మోదీ మోహన్ భగవత్‌తో ఉన్నారా లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల పై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి తేడా అదే
ఏఐసీసీ కొత్త ఆఫీసు దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక కాబోతోందన్నారు రేవంత్ రెడ్డి. 140ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకుందన్నారు. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్వార్థంగా ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించింది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకే ముందన్నారు. 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులను, 40 ఏళ్ల భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలందరికీ తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నూతన కార్యాలయం నుంచే దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికలు రూపొందుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు.దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్న రోజని సీఎం అన్నారు.
Also Read : KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?