KTR News: రేపు ఈడీ ముందుకు కేటీఆర్- అధికారులు తెలుసుకునే సమాచారం ఇదేనా?
KTR News: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ ముందు హజరవనున్నారు. అడ్వకేట్ లేకుండానే కేటీఆర్ ఈడీ ముందు హజరుకానున్నారు.
KTR News: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరుకానున్నారు. అడ్వకేట్ లేకుండానే కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించారని, ఇది మనీ లాండరింగ్, ఫెమా నింబధనల ఉల్లంఘనగా జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే జరిగిన చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఈడీ కేటీఆర్‌ను విచారించనుంది. ఇంతకు ముందే ఏసీబీ నుంచి ఆ వివరాలను ఈడీ తెప్పించుకుంది.
అభియోగాలు ఇవే....
అక్రమాలు జరిగాయని ఏసీబీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక చట్టం 13 (1) ఏ, 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120-బి కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసు సీజన్ 9,10,11,12 నిర్వహణకు యుకేకు చెందిన ఫార్ములా ఈ ఆరేషన్స్‌కు స్పాన్సర్ కంపెనీ అయిన ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలక శాఖ మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తొలి సీజన్‌ను 2023 ఫిబ్రవరి 11న నిర్వహించారు. దీనికి నిర్వహణ ఖర్చు కింద హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు పెట్టింది.
అయితే స్పాన్సర్ కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు మధ్య విబేధాలు రావడంతో స్పాన్సర్ కంపెనీ పక్కకు తప్పుకుంది. దీంతో తామే ఆన్ని ఖర్చులు భరించేందుకు సిద్ధమని తెలంగాణ పురపాలక శాఖ స్పాన్సర్ కంపెనీ స్థానంలో ఉండి ఒప్పందం చేసుకుంది. ఇలా ఆ తర్వాతి సీజన్లలో ఫీజులు, ఖర్చులు, పన్ను చెల్లింపుల రూపంలో పురపాలక శాఖ 55 కోట్లు యూకే కంపెనీ ఖాతాలోకి సాధారణ నిధుల నుంచి తరలించింది. క్యాబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇలా చెల్లింపులు జరపడం చట్ట విరుద్దం. అంతే కాకుండా హెచ్ఎండీఏ పది కోట్లకు మించి ఖర్చు చేయాలంటే పరిపాలనపరమైన అనుమతులు ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. కాని ఇది జరగలేదు. విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు జరిగాయి. ఇది ఫారిన్ ఎక్సెంజ్ రెమిటెన్స్ నిబంధనలకు వ్యతిరేకం. ఆర్బీఐకు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదు. ఎన్నికల సందర్భంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి కాని అనుమతి లేకుండా చెల్లింపుల వ్యవహారం జరిగింది.
Also Read: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం
కేసులు వీరిపైనే
ఏసీబీ కేసులో ఏ1 గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డి ఉన్నారు. వీరిని ఇప్పటికే విడివిడిగా ఏసీబీ విచారించింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధులను విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిపామని సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డి ఎసీబీ ముందు చెప్పారు. దీంతో కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ ఆయన్ని ఇప్పటికే విచారించింది. జనవరి 9వతేదీన ఎసీబీ ఏడు గంటలపాటు కేటీఆర్‌ను విచారంచిన విషయం తెలిసిందే. మరో దఫా ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈడీ ఏం తెలుసుకోనుంది.
ఏసీబీ ఏఫ్. ఐ. ఆర్‌లో పేర్కొన్న అంశాలపై ఈడీ రేపు ఉదయం పది గంటలకు కేటీఆర్‌ను విచారించనుంది. అడ్వకేట్ లేకుండానే ఈడీ కేటీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా రేస్ కేస్‌లో ఒప్పందాలు ఏం చేసుకున్నారు. ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు. ఫెమా నిబంధనలను ఉల్లఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు. ఎలా పంపారు. అవి చివరికి ఎవరి ఖాతాలో పడ్డాయి. ఇందులో కేటీఆర్‌తోపాటు అధికారు పాత్ర ఎంత. ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడచింది. అన్న వివరాలను ఈడీ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈడీ కేటీఆర్‌పైకేసు పట్టే అవకాశాలను పరిశీలంచనుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Also Read: సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం