Telangana CJ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం
Telangana Chief Justice | సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Telangana CJ Sujoy Paul | తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. సీనియర్ న్యాయమూర్తి అయిన జడ్జి సుజయ్ పాల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. తెలంగాణ సీజేఐ జస్టిస్ అలోక్ అరాదే ఇటీవల బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడం తెలిసిందే. దాంతో తాత్కాలికంగా ఆ బాధ్యతల్ని సుజయ్ పాల్‌కు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
2024 మార్చిలో తెలంగాణ హైకోర్టుకు బదిలీ
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన అనంతరం 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ (MP Bar Council)లో పేరు నమోదు చేసుకుని కెరీర్ ప్రారంభించారు. గతంలో మానవ హక్కుల కమిషన్, పలు బోర్డులకు, బ్యాంకులు సేవలు అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. ఆపై 2014 ఏప్రిల్ 14న రెగ్యూలర్ న్యాయమూర్తిగా నియామితులు కావడంతో పూర్తి స్థాయిలో సేవలు అందించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో తెలంగాణకు వచ్చారు. 2024 మార్చి నెలలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రస్తుత తెలంగాణ సీజే అలోక్ అరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడంతో సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈ మేరకు జాయింట్ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.