Budget 2025: పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాలను విలీనం చేయడం మంచి ఆలోచనేనా?
Income Tax : 2025 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో దేశంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి జనాభా ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో దేశంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి జనాభా ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎప్పటిలాగే, రూ. 15 లక్షల వరకు సంపాదించేవారికి పన్ను మినహాయింపులు, కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఆదాయపు పన్ను పరిమితి పెంచుతుందని ప్రభుత్వం పై వారంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగానే ప్రభుత్వం పాత ఆదాయపు పన్ను విధానంలో ఎటువంటి పెద్ద మార్పులను ప్రవేశపెట్టే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందా అనే చర్చలకు దారితీసింది. అయినప్పటికీ, గృహ రుణ వడ్డీ తగ్గింపుల వంటి ప్రయోజనాలపై ఆధారపడే పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా ఉన్నందున అటువంటి చర్యలు చేపట్టడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో నిర్ధిష్ట ఆదాయ పరిమితి దాటితే పన్ను చట్టంలోని పన్ను శ్లాబులకు అనుగుణంగా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత, కొత్త అని రెండు పన్ను విధానాలు ఉన్న సంగతి తెలిసిందే. డీఫాల్ట్‌గా మాత్రం కొత్త పన్ను విధానాన్నే ఉంచగా.. అవసరమైతే పాత పన్ను విధానంలోకి మారొచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు 2025, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌కు ముందు ఈ పన్ను విధానంపై తీవ్ర చర్చ నడుస్తోంది. పాత పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందన్న అనుమానం పెరుగుతోంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. అలాంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా దీనిపై ప్రకటన రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Flying Cars : 2026 నాటికి ఎగిరే కార్లు సిద్ధం - వీటి ధరెంత? స్పెసిఫికేషన్స్ ఇవే..!
2020 బడ్జెట్ అప్పుడే కేంద్ర ప్రభుత్వం.. కొత్త పన్ను విధానం అమల్లోకి తెచ్చింది. అయితే పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉన్నట్లుగా కొత్త పన్ను విధానంలో లేకపోయినా టాక్స్ రేట్లు మాత్రం దానితో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే పాత పన్ను విధానంలో వివిధ పథకాల పెట్టుబడులపై, జీవిత భీమా ప్రీమియంలపై, గృహ రుణాల అసలుపై ఇలా వేర్వేరు పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c సహా ఇతర సెక్షన్ల కింద పన్ను తగ్గించుకునేందుకు చాలా ఎంపికలు ఉన్నాయి. అందుకే ఇలాంటి బెనిఫిట్స్ కోరుకునే వాళ్లు పాత పన్ను విధానంలో కొనసాగుతున్నారు. అయితే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. సెక్షన్ 80c కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు టాక్స్ తగ్గించుకోవచ్చు. నిపుణులు మాత్రం ఇప్పుడు పాత పన్ను విధానం రద్దు ఉంటుందన్న వాదనలతో ఎక్కువగా ఏకీభవిస్తున్నారు.
కొత్త పన్ను విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు?
పన్ను ప్రక్రియను సరళీకృతం చేయడానికి 2020 కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. తక్కువ పన్ను రేట్లను అందించడం ద్వారా పన్ను శాఖ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ఎక్కువ మందిని పన్ను కట్టే విధంగా ప్రోత్సహించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. “పన్ను ప్రక్రియను సరళీకృతం చేయడానికి, సమ్మతిని మెరుగుపరచడానికి ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రాధాన్యతనిచ్చింది. పన్నులను ఆదా చేయడానికి వ్యక్తులు బలవంతంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేకుండా చేయడం, తద్వారా వారి వద్ద ఎక్కువ నగదు అందుబాటులో ఉంచడం కూడా దీని లక్ష్యం,” అని జేఎస్ఏ అడ్వకేట్స్ అండ్ సొలిసిటర్స్ భాగస్వామి కుమార్‌మంగళం విజయ్ అన్నారు.
Also Read : German Companies : అబద్ధాలు చెప్పి లీవ్ తీసుకుంటున్నారా? - అయితే మీకో అలర్ట్, వీరు మిమ్మల్ని పట్టిస్తారు!
దాదాపు మూడింట రెండు వంతుల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు దీనిని ఎంచుకున్నందున, కొత్త పన్ను విధానం పట్ల ప్రాధాన్యత స్పష్టంగా ఉంది. 67శాతం కంటే ఎక్కువ పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఇది దాని పెరుగుతున్న ప్రజాదరణను నొక్కి చెబుతుంది. పాత ,కొత్త పన్ను విధానాలను విలీనం చేయడం వల్ల రెండింటిలోనూ బెస్ట్ ఆఫ్షన్లను అందించవచ్చు. పన్ను చెల్లింపుదారులు పాత విధానంలో అందుబాటులో ఉన్న తగ్గింపులను నిలుపుకుంటారు. అదే సమయంలో కొత్త విధానం అధిక పన్ను స్లాబ్‌ల నుండి ప్రయోజనం పొందుతారు. ఇది అర్హతగల వ్యక్తులకు గణనీయమైన పన్ను ఆదాను చేస్తుంది.