German Companies : అబద్ధాలు చెప్పి లీవ్ తీసుకుంటున్నారా? - అయితే మీకో అలర్ట్, వీరు మిమ్మల్ని పట్టిస్తారు!
Fake Sick Leaves : జర్మనీలో ఉద్యోగ మార్కెట్లో ఒక ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. అనారోగ్యం సాకుతో ఎక్కువ కాలం సెలవులో ఉన్న ఉద్యోగులపై కంపెనీలు నిఘా ఉంచుతున్నాయి.

German Companies : విద్యార్థులు స్కూళ్లకు సెలవులు పెట్టినట్లు ఉద్యోగులు కొన్నిసార్లు ఆఫీసుకు సెలవు పెడుతుంటారు. వారు సాధారణంగా జలుబు, జ్వరం, కడుపునొప్పి అంటూ సిల్లీ రీజన్లు చెప్పి ఆఫీసుకు డుమ్మా కొడుతుంటారు. కానీ ఇప్పుడు ఇలాంటి కారణంతో ఆఫీసుకు సెలవు పెడితే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. జర్మనీలో ఉద్యోగ మార్కెట్లో ఓ ఆశ్చర్యకరమైన ధోరణి కనిపిస్తోంది. అనారోగ్యం సాకుతో ఎక్కువ కాలం సెలవులో ఉన్న ఉద్యోగులపై కంపెనీలు నిఘా ఉంచుతున్నాయి. దీని కోసం ప్రైవేట్ డిటెక్టివ్‌లను నియమిస్తున్నారు. ఈ సెలవులన్నీ నిజంగా అవసరమా లేక కేవలం సాకునా అని తెలుసుకోవడమే దీని ఉద్దేశం.
డిటెక్టివ్ ఏజెన్సీలకు పెరిగిన డిమాండ్
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్న లెంట్జ్ గ్రూప్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఇలాంటిదే వెల్లడించింది. తమ కంపెనీ ప్రతి సంవత్సరం దాదాపు 1,200 కేసులను దర్యాప్తు చేస్తుందని, గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఇది రెట్టింపు అని డిటెక్టివ్ ఏజెన్సీ తెలిపింది.
వ్యాధుల పేరుతో సెలవులు
జర్మనీ గణాంకాల సంస్థ డెస్టాటిస్ డేటా ప్రకారం.. 2021లో సగటున ప్రతి ఉద్యోగి 11.1 రోజుల అనారోగ్య సెలవు తీసుకున్నారు. ఇది 2023లో 15.1 రోజులకు పెరిగింది. 2023లో ఈ సెలవుల కారణంగా దేశ GDP 0.8శాతం తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీసింది.
ప్రైవేట్ డిటెక్టివ్‌ల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
తమ దర్యాప్తులో చాలామంది ఉద్యోగులు అనారోగ్యం పేరుతో కుటుంబ వ్యాపారంలో సహాయం చేస్తున్నారని లేదా వారి ఇళ్లను మరమ్మతులు చేయించుకుంటున్నారని డిటెక్టివ్‌లు కనుగొన్నారు. ఒక సందర్భంలో, ఒక ఇటాలియన్ బస్సు డ్రైవర్ 'ఆందోళన' నెపంతో సెలవులో ఉన్నాడు, కానీ ఈ సెలవుదినం సమయంలో అతను ఒక పబ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అయితే, ఇటాలియన్ సుప్రీంకోర్టు అది అతని ఆరోగ్యానికి మంచిదని తీర్పునిచ్చి, అతనిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
చైనాలో కూడా చర్చ మొదలు
ఈ వార్త చైనాలో కూడా చర్చకు దారితీసింది. ఇక్కడ ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని అనారోగ్య సెలవు సమయంలో తగ్గించుకుంటారు. జర్మనీలో అనారోగ్య సెలవు సమయంలో పనితీరు బోనస్‌లు, రివార్డులను తగ్గించకపోతే అది నిజంగా ఒక కల అని ఒక చైనీస్ వినియోగదారు అన్నారు. డిటెక్టివ్‌ల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు, కంపెనీలు శ్వాసకోశ సమస్యలు, మానసిక ఆరోగ్యం, పని ప్రదేశంలో ఒత్తిడి వంటి వ్యాధుల పెరుగుతున్న కారణాలపై దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. ఈ ధోరణి జర్మనీ వెలుపల కూడా వ్యాపిస్తోంది. సోషల్ మీడియాలో మొదలైన చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అంతే కాకుండా కొన్ని దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఇది ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారు పని నుంచి తప్పించుకోకుండా నిరోధించగలదు. సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల ఇటీవలి అధ్యయనం ప్రకారం..వాయిస్ టోన్ ఆధారంగా 70శాతం ఖచ్చితత్వంతో ఒక వ్యక్తి జలుబుతో బాధపడుతున్నాడో లేదో ఏఐ గుర్తించింది.
Also Read : Budget 2025: కొత్త పన్ను వ్యవస్థలో హౌస్ లోన్లకు మినహాయింపులు ఇస్తారా? - బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన ఉండొచ్చు!





















