Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP Desam
విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం.. చిన్నారిపాలిట శాపంగా మారింది. డాబాపై ఆడుకుంటూ 11 కేవీ తీగ పట్టుకున్న ఆరేళ్ల పాప. కుమార్తెను రక్షించబోయిన తల్లి.. ఇద్దరికీ తీవ్రగాయాలు. చిన్నారి చేయి తొలగించిన వైద్యులు.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తల్లి. ఇదంతా ఓ విద్యుత్ శాఖ అధికారి నిర్లక్ష్యం. ఇంటిని ఆనుకుని అత్యంత ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ హైటెన్షన్ వైర్లును తొలగించాలని అనేకసార్లు ఫిర్యాదు చేశారు.. అదిగో తొలగిస్తాం.. ఇదిగో తీసేస్తామని చెప్పుకొచ్చారు. చివరకు ఫిర్యాదు చేసినా మండల ఏఈ కానీ, స్థానిక లైన్‌మేన్ కానీ పట్టించుకోలేదు.. ఫలితం బంగారు భవిష్యత్తు ఉన్న ఆరేళ్ల చిన్నారి చేయిని కోల్పోయే పరిస్థితి తలెత్తిందని, కేవలం విద్యుత్తుశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈదారుణం జరిగిపోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు ఆ కుటుంబికులు. విద్యుదాఘాతంతో చేయిన కోల్పోయిన చిన్నారి కేతా లాస్య మాధురి తీవ్ర గాయాల పాలై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కుమార్తెను రక్షించే ప్రయత్నం చేసిన తల్లి కేతా రమావతి కూడా కాలిపోయిన తీవ్రగాయాలతో అక్కడే చికిత్స పొందుతుంది.. ఈ విషాద సంఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కాకినాడలోని ఇంద్రపాలెంకు చెందిన తల్లీ కూతురు కేతా రమాదేవి, కేతా లాస్యమాధురిలు సంక్రాంతి సెలవులకు తాత కుక్కల ఆంజినేయులు ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో డాబా పై బియ్యం ఆరబెట్టేందుకు వెళ్లగా తల్లితో కూడా చిన్నారి లాస్య ఆడుకుంటూ వెళ్లి డాబాపై పక్కనే ఉన్న 11 కేవీ తీగను పట్టుకుంది.. దీంతో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో విద్యుదాఘాతానికి గురై చిన్నారి కాలిపోతుండగా తల్లి రమాదేవి చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయడంతో ఆమె కూడా షాక్‌కు గురై కాలిపోతుండగా స్థానికులు గమనించి సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు.. అప్పటికే చిన్నారి చేయి పూర్తిగా కాలిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లపోయింది. తల్లికూడా తీవ్రగాయాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది.. హుటాహుటీన 108కు సమాచారం ఇచ్చి అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్తు శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంకు గురైన చిన్నారి లాస్యమాధురి కుడి చేయి పూర్తిగా కాలిపోవడంతో చేయిని తొలగించాల్సి వచ్చిందని కాకినాడ జీజీహెచ్ వైద్యాధికారులు తెలిపారని కుటుంబికులు కన్నీరు మున్నీరయ్యారు. కేవలం విద్యుత్తు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తన పిన్ని, చెల్లి ప్రమాదానికి గురై చేయిని కోల్పోవలసి వచ్చిందని బొక్కా సురేష్ ఆరోపిస్తున్నాడు. అయితే దీనిపై విద్యుత్తు విజిలెన్స్ అధికారులు ఆదివారం సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈసంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్లవరం పోలీసులు తెలిపారు.





















