Jawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP Desam
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం తీవ్రవిషాదంలోకి వెళ్లిపోయింది. కారణం తమ ప్రాంతానికి గర్వకారణమైన ఓ జవాన్,నవయువకుడు ఉగ్రదాడిలో అమరుడయ్యాడు. బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన జవాన్ కార్తీక్ సోమవారం జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. జవాన్ కార్తీక్ ఇకలేడన్న వార్త తెలియగానే తన కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. బుల్లెట్ తగిలిందని తొలుత సమాచారం ఇచ్చారని..ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని చెబుతున్నారంటూ కార్తీక్ తల్లి తండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. జవాన్ కార్తీక్ అమరవీరుడైన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. జవాన్ త్యాగం, దేశానికి అందించిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ప్రభుత్వం తరపున కార్తీక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సైనిక లాంఛనాలతో కార్తీక్ పార్థివదేహాన్ని సొంతూరికి పంపించే ఏర్పాట్లు సైనిక అధికారులు చేస్తున్నారు. ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ కార్తీక్ పార్థివదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.





















