Heart Health Tips : గుండె సమస్యలకు 4 ప్రధాన కారణాలు ఇవే.. హార్ట్ హెల్త్ కోసం నిపుణులు ఇస్తోన్న సూచనలు
Healthy Heart : గుండె జబ్బులను తేలికగా తీసుకోకూడదని.. కొన్ని తప్పులు చేస్తే గుండెకు ప్రమాదమని చెప్తున్నారు. ఇంతకీ అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

Heart Problems Causes : ఈ మధ్యకాలంలో గుండె సమస్యలు అందరినీ భయపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తోన్న ఈ సమస్యకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్‌లలో పట్టభద్రుడైన డాక్టర్ సౌరభ్ సేథీ.. సోషల్ మీడియాలో ఆరోగ్య, ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ బాగా ప్రాచుర్యం పొందారు. దీనిలో భాగంగానే ఆయన రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రధానంగా నాలుగు విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అవేంటో.. వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి (Stress)
డాక్టర్ సేథీ ప్రకారం.. ఒత్తిడి లేదా ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉండడం అనేది గుండెకు సంబంధించిన ప్రధాన సమస్యలలో ఒకటని తెలిపారు. ఇది అధిక ఒత్తిడి రక్తపోటును కూడా పెంచుతుందని.. దీర్ఘకాలంలో గుండెను బలహీనపరుస్తుందన్నారు. కాబట్టి రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు, మానసికంగా సమతుల్యతతో ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రెస్ తగ్గించుకునేందుకు ధ్యానం, డీప్ బ్రీత్, తేలికపాటి వ్యాయామం చేస్తే ఒత్తిడిని తగ్గుతుందని సూచనలిచ్చారు.
నిద్ర సమస్యలు (Bad Sleep Cycle)
సరిగ్గా నిద్రపోకపోవడం లేదా రాత్రి సమయంలో క్రమరహితంగా నిద్రపోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. నిద్ర సమస్యలు గుండెకు హానికరమన్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుందని.. ఇది గుండెపై ఒత్తిడి పెరిగేలా చేసి.. హార్ట్ డీసిజ్ పెంచుతుందని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం, ఉదయం 7-8 గంటలకు నిద్రలేవడం మంచిదని.. ఈ స్లీప్ సైకిల్ గుండెకు మేలు చేస్తుందని తెలిపారు.
వ్యాయామం (Physical Inactivity)
డెస్క్ జాబ్‌లు చేసే చాలామందికి శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలంపాటు కదలకుండా ఇలా కూర్చోవడం వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ సేథీ తెలిపారు. కాబట్టి ప్రతిరోజూ నడవడం, శరీరాన్ని సాగదీయడం లేదా జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
కాలుష్యం (Polluted Environment)
కాలుష్యం కూడా గుండె ఆరోగ్యానికి హానికరమైనదని తెలిపారు. అలాగే ధూమపానం కూడా గుండె ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. గాలిని శుభ్రంగా ఉంచుకోవడానికి, గుండెను కాపాడుకోవడానికి స్మోకింగ్ మానేయడంతో పాటు.. ఇల్లు, కారులో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించాలని సూచించారు.
వీడియోలో డాక్టర్ మాట్లాడుతూ.. "ఆరోగ్యకరమైన గుండె కోసం, ఈ నాలుగు విషయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఒత్తిడి, చెడు నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండాలి. మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది." అని తెలిపారు. గుండె ఆరోగ్యం కేవలం మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే కాదు.. సరైన జీవనశైలిని అవలంబించడం ద్వారా ఏర్పడుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం, శుభ్రమైన వాతావరణం గుండెను బలంగా ఉంచుతుందన్నారు. ఈ మార్పులు కేవలం గుండెకె కాదు.. పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు.






















