Polavaram Project Name: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
Jana Sena: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పవన్ కల్యాణ్, నాగబాబు కోరుతున్నారు. అయితే టీడీపీ, బీజేపీ ఈ అంశంపై స్పందించలేదు. ఆ పార్టీలేమనుకుంటున్నాయి?

Jana Sena demand Potti Sriramulu name for the Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పేరు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాగబాబు ఈ ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో ఈ చర్చ తెరపైకి వచ్చింది.
పోలవరం ప్రాజెక్ట్ మొదటి పేరు రామపాద సాగర్
బ్రిటిష్ కాలం నుండే ఈ ప్రాజెక్టు ఆలోచన ఉంది. అయితే మొదటి సారి రామపాద సాగర్ అనే పేరు ఈ ప్రాజెక్టుకుఉండేది. అయితే, 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు. అదే సమయంలో కృష్ణా నదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్. రావు పేరు పెట్టారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇందిరా సాగర్ పేరును పక్కనపెట్టి, భౌగోళికంగా ప్రాజెక్టు ఉన్న ప్రాంతం ఆధారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు గా పిలవడం ప్రారంభించింది. ఒక దశలో దీనికి సర్ ఆర్థర్ కాటన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి.
వైసీపీ హయాంలో ఏం జరిగింది?
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టుకు జగన్ తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టి జీవో జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికార్డుల్లో అప్పటికే ఇందిరా సాగర్ లేదా పోలవరం అని ఉండటం, మరోవైపు టీడీపీ హయాంలో దీనిని కేవలం పోలవరం ప్రాజెక్టు గానే ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో వైఎస్ఆర్ పోలవరంగా ప్రాచుర్యంలోకి రాలేదు. జీవో ఇచ్చినప్పటికీ రికార్డుల్లో పోలవరం అనే ఉంది. దాంతో ఆ పేరు ఉనికిలో లేదని అనుకోవచ్చు.
జనసేన ప్రతిపాదన - అమరజీవికి గౌరవం
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , నాగబాబు పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు గా దీనిని పిలవాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తుగా, రాష్ట్రానికే తలమానికమైన ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు ఉండటం సముచితమని వారు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వెనుక సామాజిక సమీకరణాల కంటే కూడా, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తికి దక్కాల్సిన గౌరవం అనే కోణం బలంగా కనిపిస్తోంది. ఇది కూటమి ప్రభుత్వంలో అంతర్గత చర్చలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతిపాదించినందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు ఉంది. కాబట్టి, ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సానుకూల సంకేతాలు పంపవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కేంద్రం , నిధుల వ్యవహారం
బీజేపీ నేతలు వాజ్ పేయి పేరు పెట్టాలని కోరుకుటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు . విభజన చట్టం ప్రకారం దీని నిర్మాణానికి నిధులను కేంద్రమే భరిస్తోంది. సాధారణంగా జాతీయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చుకునే అధికారం ఉన్నప్పటికీ, కేంద్ర రికార్డుల్లో పాత పేరు లేదా ప్రాజెక్ట్ కోడ్ అలాగే ఉంటుంది. కేంద్రం ఈ పేరు మార్పు విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు. కానీ బీజేపీ నేతలు వాజ్‌పేయి పేరును గతంలో ప్రస్తావనకు తెచ్చారు. అందుకే పోలవరం పేరుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.





















