పొట్టిగా ఉన్నామని ఫీలవుతున్నారా? ఆ వయస్సు దాటిన తర్వాత కూడా హైట్ ఎదగొచ్చట, ఇదిగో ఇలా..
అందరికి ఆరడుగులు ఎదగాలనే ఉంటుంది. కానీ అలా ఎదిగే వారు కొంత మందే. కానీ ఎత్తు పెరిగేందుకు మన ప్రయత్నం మనం చెయ్యొచ్చట.
చాలామంది పొట్టిగా ఉన్నామని తెగ ఫీలైపోతుంటారు. పొడవుగా ఉండాలని కలలుగంటారు. కానీ, అది సాధ్యం కాదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొందరిలో జీన్స్ వల్ల ఎదుగుదల ఆగిపోతే.. మరికొందరు చిన్నప్పటి నుంచి సరైన వ్యాయామాలు చేయపోవడం వల్ల ఎత్తు ఎదగరు. వయస్సు పెరిగిన తర్వాత అరే.. చిన్నప్పటి నుంచి ఎత్తు పెరిగే వ్యాయామాలు చేసి ఉంటే ఈ రోజు పొట్టిగా ఉండేవాళ్లం కాదు కదా అని బాధపడతారు. అయితే, జీవితంలో మనం ఎంత ‘ఎత్తు’ ఎదిగామనేది ముఖ్యం కాదు. ఆత్మవిశ్వాసం జీవితంలో ఎదగడమనేదే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తిస్తే.. ఎత్తు గురించి ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే, మేం ఎత్తు పెరిగాల్సిందే అనుకుంటే.. ఇలా ప్రయత్నించి చూడండి. హైట్ పెరిగేందుకు అవకాశం ఉండొచ్చు.
తీసుకునే ఆహారం నుంచి జీన్స్ వరకు మన ఎత్తును నిర్ణయించే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇందులో జీన్స్ దే 60 నుంచి 80 శాతం వరకు ముఖ్య పాత్ర. దీన్ని మనం కంట్రోల్ చెయ్యడం సాధ్యం కాదు. కానీ మిగిలిన 40 నుంచి 60 శాతం ఫ్యాక్టర్స్ ను మనం కొంత ప్రభావితం చెయ్యొచ్చు. ఏడాది వయసు నుంచి ప్యూబర్టీకి వచ్చే వరకు ఏటా దాదాపు 2 ఇంచుల వరకు ఎత్తు పెరుగుతారు. ఒకసారి ప్యూబర్టీకి వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు అప్పటి వరకు పెరిగిన దానిలో 4 శాతం వరకు పెరుగుతారు. అయితే ఇప్పుడు ప్రశ్న ప్యూబర్టీ తర్వాత కూడా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉందా అనేదే. దానికి అవుననే సమాధానం చెబుతున్నాయి కొత్త అధ్యయనాలు. జీవన శైలీలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకుంటే ప్యూబర్టీ తర్వాత కూడా కొంత ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉందట.
సమతుల ఆహారం
ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మొత్తంగా ఆరోగ్యం బావుండడం మాత్రమే కాదు.. ఎత్తు కూడా పెరగవచ్చు. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచెయ్యడం మాత్రమే కాదు, దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా కలగకుండా నివారించబడతాయి. తాజా పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు, పాల పదార్థాలు మీ రోజువారీ భోజనంలో భాగం చేసుకున్నపుడు శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి ఫలితంగా ఎత్తు కూడా సరిపడినంత పెరుగుతారు. ఎత్తు పెరగడంలో ముఖ్య పాత్ర పోషించే పోషకాలు కాల్షియం, విటమిన్ డి. ఇవి కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాలి.
వ్యాయామం
వ్యాయామం చిన్నప్పటి నుంచి అలవాటున్న వారు ఎప్పుడూ ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు. ఇది ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదం చేస్తుంది. పిల్లలకు మాత్రమే కాదు వయసుకు వచ్చిన వారిలో కూడా ఇది కొంత వరకు ఎత్తు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. యోగా, జంపింగ్ రోప్ వంటి వ్యాయామాలు ఎత్తు పెరిగేందుకు ఉపకరిస్తాయి.
సరైన భంగిమ
భుజాలు వంచి కూర్చోవడం, మెడ వంకరగా పెట్టడం వంటి కొన్ని భంగిమలు ఎత్తు పెరగడానికి అడ్డంకులు అవుతాయి. భంగిమ సరిచేసుకోక పోతే ఆ వంకరలు మీ శరీర ఆకృతిలో భాగంగా మారుతాయి. అంతేకాదు నొప్పిగా కూడా ఉంటుంది.
తగినంత నిద్ర
తగినంత నిద్ర లేకపోతే ఎదుగుదలలో లోపం ఏర్పడవచ్చు. అలాగే కొనసాగితే పెరగాల్సినంత ఎత్తు పెరగలేరు. ముఖ్యంగా వయసుకు వచ్చిన పిల్లలు తప్పని సరిగా పడుకోవాలి. నిద్రలోనే శరీరం నుంచి గ్రోత్ హార్మన్లు విడుదలవుతాయి. కనుక తగినంత నిద్ర ఎత్తు పెరగిగేందుకు చాలా అవసరం.
సప్లిమెంట్స్
పోషకాలు శరీరానికి అందడానికి ముఖ్యమైన సోర్స్ ఆహారమే. అయితే ఆహారం ద్వారా తగినన్ని పోషకాలు అందనపుడు తప్పనిసరిగా సప్లిమెంట్స్ తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమపాళ్లలో అంది ఆరోగ్యంగా ఎదుగుతారు.