తల్లిదండ్రులు పిల్లలకు కచ్చితంగా నేర్పాల్సిన విషయాలు ఇవే
పిల్లలను పెంచడం అంత సులువు కాదు, వారికి ఎదుటివారిని గౌరవించమని కచ్చితంగా నేర్పించాలి.
పిల్లలను కనడం ఎంత కష్టమో, వారిని పెంచడం అంత కన్నా కష్టం. వారు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఉండాలంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు వారికి నేర్పే పద్ధతులు, చెప్పిన విద్యాబుద్ధులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. తమ గౌరవాన్ని తాము కాపాడుకుంటూనే, ఎదుటివారిని కూడా గౌరవించేలా పిల్లల్ని పెంచాలి. అందుకే చిన్నప్పట్నించే కొన్ని విషయాలు పిల్లలకు నేర్పుతూ ఉండాలి.
అందరూ సమానమే...
కొన్ని ఇళ్లల్లో కొడుకును ఎక్కువగా, కూతురును తక్కువగా చూస్తారు. ఆ విషయంలో తల్లిదండ్రులు చాలా మారాలి. ఆడపిల్లలు, మగపిల్లలు సమానమేనని వారికి చిన్నప్పట్నించి చెప్పాలి. ఇద్దరూ సమాజంలో ఒక భాగమేనని వారికి అర్థమయ్యేలా చేయాలి.
సహాయం నేర్పండి
ఇతరులకు సహాయం చేయడం చిన్నప్పటించే వారికి నేర్పాలి. తెలిసిన వారికే కాదు తెలియని వారికి సాయం చేయవచ్చని చెప్పండి. చిన్న చిన్న సాయాలు చేయడం వారికి అలవాటు చేయాలి. ముసలివాళ్లను రోడ్డు దాటించడం, ఎవరివైనా వస్తువులు కింద పడితే అవి ఏరి ఇవ్వమని చెప్పడం వంటి చిన్నచిన్న సాయాలు నేర్పించాలి.
అందరినీ గౌరవించడం
జాతి, వయసుతో సంబంధం లేదు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పాలి. వారికి ఎదురుపడే ప్రతి మనిషిని గౌరవించమని చెప్పండి. తన కన్నా చిన్నవారిని ప్రేమతో చూడాలని నేర్పించండి. గౌరవానికి హద్దులు, నియమాలు లేవు.
కోపాన్ని అదుపులో
పిల్లల్లో కోపం రానీయకండి. కొందరు పిల్లలు కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల జరిగే నష్టాలు వారికి చెప్పండి. కోపం అధికంగా ఉండే వారికి స్నేహితులు ఉండరని, మనుషులు దూరం అవుతారని వివరించండి.ప్రశాంతంగా, నవ్వుతూ ఉండే వ్యక్తులతో ఎక్కువ మంది స్నేహం చేసేందుకు ఇష్టపడతారని వివరించండి.
తక్కువచేసి మాట్లాడవద్దు
పేద, ధనిక, నలుపు, తెలుపు... కారణం ఏదైనా ఎవరినీ వారి రంగు, రూపు, స్థాయి ఆధారంగా తక్కువగా చేసి మాట్లాడకూడదని చెప్పాలి. ఏ వ్యక్తిని కించపరిచే హక్కు ఎవరికీ లేదని వారికి వివరించాలి. తోటి వారితో స్నేహంగా ఉండాలని నేర్పాలి.
సున్నితంగా
ఎవరితోనైనా సున్నితంగా మాట్లాడాలని చెప్పాలి. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం, ఎవరైనా సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పడం వంటివి నేర్పాలి. అలాగే పిరికివ్యక్తిగా బతకకూడదని, ధైర్యంగా జీవించాలని వివరించాలి.
Also read: DASH డైట్‌తో గుండెపోటు రాకుండా ముందే అడ్డుకోవచ్చు, ఇంతకీ ఏంటీ డైట్?
Also read: ఆ వయసు దాటిన ప్రతి కరోనా బాధితుడిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.