Winter Foods: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే... తేమను కాపాడుతాయి
కాలానికి తగ్గట్టు ఆహారం తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సరైన పద్ధతి.
చలికాలాన్ని చాలా మంది ఇష్టపడతారు. చెమటలు కారే వేసవితో పోలిస్తే ఉల్లాసంగా ఉండే శీతాకాలాన్నే ఇష్టపడతారు ఎక్కువమంది. అయితే శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో దాహం తక్కువ వేస్తుంది. దీని వల్ల నీరు తక్కువ తాగుతారు. ఈ కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే చలికాలంలో కూడా మూడు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. అలాగే శరీరంలోని తేమను కాపాడే ఆహారాన్ని కూడా తినాలి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనెలో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీన్ని రోజూ ఉపయోగిస్తే చాలా మంచిది. పోషకాలు, మంచి కొలెస్ట్రాల్‌తో నిండిన ఆలివ్ నూనె మీ చర్మాన్ని బయటి నుంచే, లోపలి నుంచి కూడా కాపాడుతుంది. తేమ బయటికి పోకుండా అడ్డుకుంటుంది. చలికాలంలో ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటలు తింటే ఎంతో మేలు.
పాలకూర
పాలకూర ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి. శరీరాన్ని తేమవంతంగా ఉంచుతుంది. ఎందుకంటే ఈ ఆకుకూరలో నీటి శాతం అధికంగా ఉంటుంది. పొటాషియం, ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో సరైన ఆహారం ఇదే.
ఎరుపు, పసుపు క్యాప్సికం
ఆకర్షించే రంగుల్లో ఉండే ఈ కూరగాయలు ఆరోగ్యానికి కూడా మంచివి. వీటిని బెల్ పెప్పర్స్ అంటారు. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ బి6, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి అత్యవసరమైనవి.
టొమాటోలు
టొమాటోలు లేనిదే పూట గడవదు తెలుగు వాళ్లకి. కూరలకు అద్భుతమైన రుచిని అందించడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయివి. వీటిలో కూడా నీటి కంటెంట్ ఎక్కువే. ఇవి శరీరాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్
రోజూ డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తిన్నా చాలు శరీరంలోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. ఇవి ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరంలో నీటిని నిలపడంలో చాక్లెట్లోని పోషకాలు సహాయపడతాయి.